Site icon vidhaatha

Revanth Reddy | ఆర్టీసీ కార్మికులు.. సమ్మె ఆలోచన వీడండి

విధాత : ఆర్టీసీ కార్మికులు పంతాలకు పట్టింపులకో వెళ్లవద్దని సమ్మె ఆలోచన వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది మీ సంస్థ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉందని..తాము అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దని..కడుపు మంటతో, అసూయతో చెప్పే విషపు మాటలు నమ్మి సమ్మె బాట పడితే మొత్తం ఆర్టీసీ సంస్థనే దెబ్బతింటుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించాలని మేము చేయగలిదింది ఏది ఉన్నా చేస్తామని అన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ప్రతి నెల రాష్ట్రానికి రూ. 18,500 కోట్ల ఆదాయం వస్తుందని..అదంతా మీ చేతుల్లో పెడతా ఎవరికి ఎలా పంచుదామో.. ఏ పథకం ఆపాలో ఏ పథకం ఆపకూడదో మీరే చెప్పండని కార్మిక సంఘాలను కోరారు. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ పార్టీ 50 మంది కార్మికులను పొట్టనపెట్టుకుందని..కానీ మీతో చర్చలకు ముందుకు రాలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం బాగోలేదని కార్మిక సోదరులందరూ సహకరించాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోందని..ఒక సంవత్సరం అయితే కుదురుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కార్మికులందరూ సహకరించాలని కోరారు. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని..ఆర్టీసీ కార్మికులు మా కుటుంబ సభ్యులని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు

గత పదేళ్లలో ఆర్థిక విధ్వంసం..దోపిడీ జరిగిందని..గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారని..1లక్షా 20వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారని, సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలిందన్నారు. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక సింగరేణి, ఆర్టీసీలో కారుణ్యనియామకాలను సులభతరం చేశామన్నారు. సింగరేణి ఔట్ సోర్స్ సిబ్బందికి బోనస్ ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదేనని, సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా కల్పించామన్నారు.

గత ప్రభుత్వం అసంఘటిత కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. చనిపోయిన కార్మికుల పట్ల కనీసం మానవత్వంతో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా గిగ్ వర్కర్క్స్ విధానం తీసుకురాబోతున్నామన్నారు. ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలవబోతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల కార్మికులు భాగస్వాములయ్యారని, ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికల పాత్ర మరువలేనిదన్నారు. కార్మికుల సంక్షేమమే మా ప్రభుత్వ విధానం అని సీఎం అన్నారు. గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు అక్కడ చనిపోతే వారి శవాలను కూడా తేలేని పరిస్థితి ఉండేదని కానీ మేమొచ్చాక వారి శవాలను తీసుకురావడమే కాకుండా అలాంటి బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు.

కపట నాటక సూత్రధారి కేసీఆర్‌..

పదేళ్లు ఏమీ చేయని కపట నాటక సూత్రధారి కేసీఆర్ మళ్లీ బయటకు వచ్చాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ సభలో కేసీఆర్ ఒకటే శాపనార్ధాలు పెడుతున్నారని పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ చేసిన దోపిడీ ప్రజలు మర్చిపోలేదన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం జరిగిందని తెలంగాణలోని పేదలు మరింత పేదలుగా మారితే కేసీఆర్ కుటుంబం ఎలా వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు. కేసీఆర్ రూ. 8.15 లక్షల కోట్లు అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారని ఆయన చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు రూ. 1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. 20 ఏళ్లు మీకు అండగా ఉంటానన్నారు. కేసీఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని..దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానైన అవకాశం ఇవ్వండని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ప్రజాప్రభుత్వానికి సహరించండి

కార్మిక సంఘాలు ప్రజాప్రభుత్వానికి సహకరించి రాష్ట్రాభివృద్ధిలో కలిసి నడవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టిన రాష్ట్రం తెలంగాణ తప్ప ఈ దేశంలోనే మరొకటి లేదని తెలిపారు. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో కూడా ఇది జరగలేదని ఇది నా చాలెంజ్ అని మాతో పోటీ పడాలన్నారు. ఇంత చేసినా ఇది సరిపోదని రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి మరికొంత సమయం కావాలన్నారు. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. తెలంగాణ కులగణన చేసినట్లుగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించిందంటే దీనికి కారణం కార్మికులందరూ తెలంగాణలో తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version