అమరావతి, విధాత : ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా ఫించన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అకారణంగా తొలగించిన మూడు లక్షల సామాజిక ఫించన్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఇలా తొలగించిన వారిలో ఎక్కువగా టీడీపీ సానుభూతి పరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తొలగింపునకు గురైన వారందరికి మళ్లీ పునరుద్ధరించి రానున్న మూడు నెలల్లో అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
రాష్ట్రంలో వివిధ వర్గాల వారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా ఫించన్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, ట్రాన్స్ జెండర్, మత్స్యకారులు, గీత కార్మికులు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, ధీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు ఇలా మొత్తం 17 వర్గాల వారికి ప్రతి నెలా ఆర్థిక సాయం అందచేస్తున్నారు. కేటగిరీల వారీగా నెలకు రూ.4 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 65,18,496 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. కొత్తగా చేరే 3 లక్షల మంది తో లబ్ధిదారుల సంఖ్య 68 లక్షలు దాటనున్నది. ప్రస్తుతం రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3వేల నుంచి రూ.6వేల వరకు, మూడో కేటగిరీ లో పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు ఇస్తున్నారు. నాలుగో కేటగిరీలో దీర్ఘకాలిక వ్యాధులు తలసేమియా, మూత్ర పిండాలు వంటి వాటితో బాధపడే వారికి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నారు. వీరందరికీ ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఒకే రోజులో పంపిణీ చేస్తున్నారు. రెండు నెలలు వరుసగా తీసుకోని వారికి మూడో నెలలో మూడు నెలల మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఫించన్ తీసుకునే కుటుంబ పెద్ద చనిపోతే ఆయన భార్యకు రెన్యూవల్ చేస్తున్నారు.
Read more:
చలికాలంలో మీ చర్మాన్ని రక్షించుకోవడానికి మంచి టిప్స్..
కర్నూలుకు సైరా నరసింహా రెడ్డి పేరు పెట్టాలి.. మాజీ ఎంపీ విజయసాయి డిమాండ్
