- నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ!
- కొండా మురళి వ్యవహారం తేలుస్తారా?
విధాత, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వరుసగా విమర్శలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్యలు తీసుకొంటుందోననే చర్చ సర్వత్రా నెలకొంది. మంత్రివర్గంలో చోటు లభించలేదనే కారణంగా రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వినిపిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు మీడియా సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శనివారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆగస్టు 10న హైదరాబాద్ లో భేటీ కానుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా?
సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఆయన ఈ విమర్శలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ తనకు హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఈ హామీని అమలు చేస్తారా చేయరా అనేది పార్టీ నాయకత్వం ఇష్టమంటూనే ఆయన విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై పార్టీ నాయకత్వానికి గానీ, క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదులు అందలేదు. దీనిపై ఢిల్లీలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఇవి తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఫోన్ మాట్లాడుతానన్నారు. ఆదివారం జరిగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. నోటీసులు ఇచ్చి వివరణ కోరుతారా? క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని అడుగుతారా? అనేది చర్చ సాగుతోంది.
కొండా మురళి వ్యవహారం తేలుస్తారా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన ఆయన వైరి వర్గం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కొండా మురళి కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తన వాదనను వినిపించారు. తనపై ఫిర్యాదు చేసిన వైరివర్గంపై ఆయన కూడా ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొండా మురళి దంపతులు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా గత నెల మొదటి వారంలో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని, తమపై వైరి వర్గం ఫిర్యాదులపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలిపిస్తామని కొండా మురళి మీనాక్షి నటరాజన్ కు హామీ ఇచ్చారు. మురళి అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంశం కూడా చర్చకు రావాల్సి ఉంది. కానీ, ఆయన దీనిపై పార్టీకి వివరణ ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. దీంతో ఈ అంశంపై ఎలాంటి చర్చ ఉండదని తెలిసింది. ఆదివారం సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.