విధాత: గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో లక్షలాది భూ సమస్యలు వచ్చాయని..తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతన భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని..దీంతో భూ సమస్యల పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం భూ భారతిపై అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. భూ భారతిపై అన్ని మండలాల్లో అధికారుల చేత అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూమి అంటేనే ఆత్మగౌరవం అలాంటి భూమి పై పంచాయతీలు హత్యల వరకు దారితీస్తున్నాయన్నారు.
భూ వివాదాల్లో గతంలో తహశీల్ధార్ ను కూడా తగలబెట్టిన ఘటనలు చూశామన్నారు. ధరణి ద్వారా దశాబ్దాల క్రితం భూమి అమ్మినా కూడా తిరిగి అమ్మిన వ్యక్తి పేరు మీదనే భూ హక్కులు వచ్చాయని..దీని ద్వారా లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో భూమి అమ్మినప్పుడు ఆ గ్రామ పెద్దమనుషులు చెప్తే అయిపోతుందని..తరువాత తెల్ల కాగితాల మీద రాసుకోవడం రిజిస్ట్రేషన్ లు వచ్చాయని..ఇప్పుడు భూమి ఒకరిపై ఉంటే రిజిస్టేషన్ లు మరొకరి పై ఉంటున్నాయన్నారు.
అందుకే ప్రభుత్వం భూ హక్కులపై భరోసా కల్పించేందుకు, అక్రమాల నివారణకు భూ భారతి చట్టం తెచ్చిందన్నారు. ఆధార్ మాదిరిగా భూధార్ కార్డులు వస్తున్నాయన్నారు. అధికారులు, ప్రజలు ప్రభుత్వ భూములు కాపాడాలని…అవి ప్రజల ఆస్తి అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తి ప్రజా అవసరాలకు విద్యా ,వ్యవసాయ గ్రామ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి సహా జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.