విధాత, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ మహ్మద్ అజారుద్దీన్‌ను తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రిగా అవకాశం కల్పిస్తున్నట్లుగా అజార్ కు సమాచారం అందించారు. ఎల్లుండి శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయనతో పాటు కోదండరామ్ పేరును కూడా గవర్నర్ కోటాలో ప్రతిపాదించారు. అయితే గవర్నర్ కోటాలో ప్రభుత్వం ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరామ్ ల పేర్లను గవర్నర్ ఇంకా ఆమోదించకుండానే అజారుద్దీన్ ను రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోనుండటం గమనార్హం.
రాష్ట్ర కేబినెట్ లో మైనార్టీ వర్గం నుంచి, ముఖ్యంగా హైదరాద్ నుంచి మంత్రి పదవి లేకపోవడం లోటుగా మారింది. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనార్టీని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు హైదరాబాద్ నగరానికి మంత్రి పదవి ఇచ్చినట్లువుతుంది. ఆకస్మాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ ను విస్తరించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మెజార్టీ సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికిప్పుడు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మూడు మంత్రి పదవులు ఖాళీ ఉండగా…ఒకటి అజారుద్ధీన్ తో భర్తీ చేయనుండటంతో మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండనున్నాయి. రాష్ట్ర కేబినెట్ లో సీఎం సహా 18మంది మంత్రులను భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంది.
