Niharika | మెగా ఫ్యామిలీలో కొత్త కాంబో.. నిహారిక నిర్మాణంలో మెగా హీరోతోక్రేజీ మూవీ?

Niharika | సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

Niharika | సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ విజయంతో పాటు నిర్మాతగా ఆయన పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో మెగా కుటుంబంలో మరో కొత్త కాంబినేషన్ రూపుదిద్దుకుంటుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

నిహారిక నిర్మాణంలో వరుణ్ తేజ్ హీరోగా?

తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఆయన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడిగా ‘టచ్ చేసి చూడు’ ఫేమ్ విక్రమ్ సిరికొండ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ దశలో చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే ఇదే వరుణ్ తేజ్ తదుపరి ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

వరుణ్ తేజ్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్

ఇప్పటికే వరుణ్ తేజ్ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నిహారిక నిర్మాణంలో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వరుణ్ తేజ్ గత కొంతకాలంగా జానర్‌లకు భిన్నంగా సినిమాలు ఎంపిక చేసుకుంటూ వస్తుండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ ఏ తరహాలో ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మెగా కుటుంబంలో నిర్మాణ సంస్థలకు ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ద్వారా అనేక మెగా హీరోల సినిమాలు నిర్మించారు.నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై పలు చిత్రాలు తెరకెక్కించారు. రెండో తరంలో సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్థాపించి విజయవంతమైన సినిమాలు నిర్మిస్తున్నారు.ఇక నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మొదట వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో నిర్మాతగా వెండితెరపై అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం నిహారిక సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఆ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన పొందింది. ఈ నేపథ్యంలో అన్నయ్య వరుణ్ తేజ్‌తో సినిమా నిర్మించాలన్న ఆలోచన మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

అధికారిక ప్రకటన కోసం వేచి చూపులు

ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, మెగా కుటుంబం నుంచి మరో క్రేజీ కాంబినేషన్ రావొచ్చన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. అన్నాచెల్లెళ్ల కాంబినేషన్‌లో సినిమా వస్తే అది మెగా ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వార్తలపై అధికారిక క్లారిటీ ఎప్పుడొస్తుందో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

Latest News