Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా సాయంపై కీలక అప్డేట్

తెలంగాణ రైతులకు రైతు భరోసా సాయంపై కీలక అప్డేట్ వచ్చింది. శాటిలైట్ సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరిలోనే నిధుల విడుదలకు అవకాశం ఉంది.

Rythu Bharosa

విధాత: తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసా పథకం నిధుల పంపిణీపై కీలక అప్డేట్ వచ్చింది. సాగు విస్తీర్ణంపై అధికారులు జయశంకర్ వర్సిటీ ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఈ రిపోర్టు ఈ నెల 6వ తేదీకల్లా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా మండలాల వారీ నివేదికలు అడగడంతో అధికారులు ఆ వివరాలు సేకరిస్తున్నారు. సర్వే వివరాల సమగ్ర నివేదిక అందాక రైతు భరోసా పంపిణీ పై నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఇదే ఫిబ్రవరి నెలలో రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.10 వేలు ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగిస్తూ.. ఎకరానికి రూ.12 వేలు ఇస్తోంది.

శాటిలైట్ సర్వేతో తేలనున్న రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య

నిజానికి ప్రభుత్వం యాసంగి పంట రైతు భరోసా నిధులను సంక్రాంతి సమయంలోనే రైతుల ఖాతాల్లో వేయాలని భావించింది. కాని రైతు భరోసా నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా సాగు భూముల వివరాల సేకరణ ఆలస్యమైంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే నిర్వహిస్తోంది. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే గత కొద్ది నెలలుగా చేయిస్తోంది. దాదాపు 10 వేల రెవెన్యూ గ్రామాల్లో మ్యాపుల ఆధారంగా సాగు పంటల వివరాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 6వ తేదీన దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. అయితే ఈ సర్వేలో దాదాపు 10 శాతం వరకు సాగు భూముల్లో పంటలు వేయలేదని తేలింది. ఆ రైతులకు వేసంగి రైతు భరోసా నిధుల జమను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ దఫా రైతు భరోసా స్కీమ్ సాయం పొందే రైతుల సంఖ్య లక్షల్లో తగ్గనున్నట్లుగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

Grammy Awards 2026 | గ్రామీ అవార్డ్స్ 2026 రెడ్ కార్పెట్‌పై బోల్డ్ ఫ్యాషన్ హంగామా.. ఆమె టాప్ లెస్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్
India vs Pakistan | పాకిస్తాన్ బహిష్కరించినా.. శ్రీలంకకు భారత్ వెళ్లాల్సిందే!

Latest News