విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్‌ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాటస్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18,000 ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్‌లో, ఈ ఉపఎన్నికలో 75,000 ఓట్లు సాధించడం అనేది కార్యకర్తల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచి ఉండవచ్చని, కానీ నైతిక విజయం మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతమ్మదేనని హరీశ్ రావు అన్నారు. మైనారిటీల మద్దతు కోల్పోతున్నామని గుర్తించిన కాంగ్రెస్, చివరి నిమిషంలో హడావుడిగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని గుర్తు చేశారు. ఇది బీఆర్‌ఎస్ పోరాట ఫలితమేనని వ్యాఖ్యానించారు. “అప్పుడప్పుడు అనైతిక విజయం, అధర్మం కూడా గెలుస్తూ ఉంటుంది. కానీ అంతిమ విజయం ధర్మానిదే” అని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లోనూ తాత్కాలికంగా ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు గెలుపును అందించాయని గుర్తు చేశారు. త్వరలోనే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, తమను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేటీఆర్,తలసాని శ్రీనన్న సహా తామంతా కార్యకర్తలకు కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ, ఇతర ఎన్నికల కోసం కలిసి పనిచేసి మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు.
రేవంత్ కుర్చీని కాపాడుకునేందుకు ఉప ఎన్నిక గెలుపు
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయన్నారు. ప్రజలు ‘ఆరు గ్యారెంటీలను 420 హామీలు’గా భావిస్తున్నారని, నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రలోభాలకు గురయ్యారని అభిప్రాయపడ్డారు. రూ. 150 కోట్లు ఖర్చు పెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి ఈ ఎన్నికను గెలిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, మార్కెట్లో డబ్బు లేకపోవడంతో పండుగల సమయంలో కూడా వ్యాపారం జరగట్లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ప్రస్తుత ఫలితం ఓటమి కాదని, కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోడ్ల మీదకు తీసుకొచ్చామని తెలిపారు. రాబోయే రెండేళ్ల తర్వాత బలమైన ‘తుఫాను’ వస్తుందని, అప్పుడు కాంగ్రెస్ ఉనికి ఉండదని జోస్యం చెప్పారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండి, బూత్ కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
