MAG7 Job Cuts | రానున్న రెండేళ్లలో బడా టెక్ కంపెనీలు లక్షన్నర నుంచి రెండు లక్షల 20వేల వరకూ ఉద్యోగులను తొలగిస్తాయని అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం అప్పుడప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపివేసే ఆర్థికమాద్యం కాదు.. ప్రపంచాన్ని శరవేగంగా చుట్టేస్తున్న కృత్రిమ మేధ! ఇప్పుడు ఇదే అంశం సిలికాన్ వ్యాలీలో ఉద్యోగులకు ముచ్చెమటలు పోయిస్తున్నది.
కంపెనీ విజయ రహస్యం ఎప్పుడైనా ఒక్కటే. తక్కువ మ్యాన్‌పవర్‌తో ఎక్కువ లాభాలు సంపాదించడం. ఇప్పుడు వారికి అత్యంత అనువుగా ముందుకు వచ్చింది కృత్రిమ మేథ. కృత్రిమ మేధతో ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో మాయమవుతాయని, వంద మంది చేసే పనిని ఒక ఏఐ టూల్ చేసిపెడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించి.. ఏఐని టెక్ దిగ్గజాలు తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున డాటా సెంటర్ల ఏర్పాటు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొనుగోలు పెరుగుతున్నదని చెబుతున్నారు.
కృత్రిమ మేధపై భారీగా పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థలు.. అందుకు ఉద్యోగాలను ఫండింగ్ సోర్స్‌గా వినియోగించుకుంటున్నాయని ఫైనాన్షియల్ విశ్లేషకులు చెబుతున్నారు. MAG7గా పిలిచే మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్ (ఆల్ఫాబెట్), యాపిల్, ఎన్‌విడియా, టెస్లా కంపెనీలు.. ఇప్పుడు ఒకే దిక్కుగా పరుగులు తీస్తున్నాయి. అది.. ఏఐ మౌలికసదుపాయాల నిర్మాణం. ఇందుకోసం ఆ కంపెనీలు పెట్టే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తక్కువేమీ కాదు. మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఏటా 45 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చు పెడుతున్నది. ఇక అమెజాన్ 60–65 బిలియన్‌లు, మెటా 35–40 బిలియన్‌లు, గూగుల్ 45–50 బిలియన్‌లు, యాపిల్ 10 నుంచి 15 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నాయి. మొత్తం ఏటా సుమారు 200 నుంచి 220 బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నాయి. అంటే రెండేళ్లకు అది 400 నుంచి 440 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఈ మొత్తాన్నీ కేవలం ఏఐ కోసమే ఈ కంపెనీలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి.
మరి అంత డబ్బు ఎలా సమకూర్చుతాయి?
భారీ పెట్టుబడులు పెట్టే క్రమంలో ఒకటి.. అప్పులు తీసుకురావడం. ఇందులో బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉన్నా.. రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్టర్ల ఒత్తిడి కారణంగా పరిమితులు ఉంటాయి. అలా అయినప్పటికీ 120 నుంచి 150 బిలియన్ డాలర్లు మాత్రమే రుణాలుగా సేకరించగలవు. రెండోది.. నగదు ప్రవాహం పెరగడం. ఇది వ్యాపారం పెరగడం ద్వారా వచ్చే అదనపు డబ్బు. ఇది సుమారు 170 నుంచి 195 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మొత్తం 400 బిలియన్ డాలర్ల నుంచి 440 బిలియన్ డాలర్లు అవసరం అనుకుంటే.. పైన చెప్పిన రెండు మార్గాల ద్వారా 290 నుంచి 345 బిలియన్ డాలర్లు వస్తాయి. మరి మిగిలిన 75–130 బిలియన్ డాలర్లు ఎక్కడి నుంచి సేకరిస్తాయి? ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ సొమ్ము.. ఉద్యోగాల తొలగింపు ద్వారా సమీకరిస్తారు. అదే కాస్ట్ కటింగ్.
కాస్త వివరంగా పరిశీలిస్తే.. దిగ్గజ కంపెనీల్లో ఒక ఉద్యోగిపై సంవత్సరానికి సుమారు 2.25 కోట్ల రూపాయలను వెచ్చిస్తాయి. ఇందులో జీతం, స్టాక్, బెనిఫిట్స్, ట్యాక్స్, ఆఫీసు ఖర్చులు అన్నీ ఉంటాయి. అది రెండేళ్లకు లెక్కిస్తే.. సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల నుంచి.. ఐదున్నర కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. అంటే.. సుమారు 7% నుంచి 11% వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తే.. ఈ మొత్తం కంపెనీలకు సమకూరుతుంది. అయితే.. ఒకేసారి వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడం కాకుండా.. దఫదఫాలుగా, నిరవధికంగా తొలగించుకుంటూ పోతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో నియామకాలు ఆపివేస్తారు. రోల్ కన్సాలిడేషన్, పర్ఫార్మెన్స్ ఎగ్జిట్స్, టీమ్ షట్‌డౌన్స్.. ఇలా మెల్లగా సాగిపోతూ ఉంటాయి. అందుకే లేఆఫ్ వార్తలు చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. కానీ.. గమనిస్తే.. చిన్న సంఖ్యలో ఉద్యోగస్తుల తొలగింపు.. క్రమపద్ధతిలో సాగుతూ ఉంటుంది. కానీ.. దాని ప్రభావం మాత్రం పెద్దగానే ఉంటుంది.
ఏ టీమ్స్‌పై కోతలు పడతాయి?
ప్రధానంగా తక్కువ వృద్ధి కలిగినవి, తక్కువ మార్జిన్స్ ఉన్నవి, లేదా బలహీనంగా ఉండి.. ఏఐకి దగ్గరలో ఉన్నవి ఫండింగ్ సోర్స్‌గా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే.. అది గేమింగ్, పెరిఫరల్ ప్రొడక్ట్స్‌పై ఖర్చును తగ్గించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్.. ఇంటర్నల్ టూలింగ్, ఎనేబుల్‌మెంట్ లేయర్స్, మెటా.. రియాలిటీ ల్యాబ్స్ (వీఆర్/మెటావెర్స్), గూగుల్.. ప్రయోగాత్మక ప్రాజెక్టులపై ఖర్చును గణనీయంగా తగ్గించుకోనున్నాయి. దీర్ఘకాలంలో లాభాలను తెచ్చిపెట్టేవాటికి బదులు.. ఏఐ ద్వారా తక్షణమే రాబడులకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఇది కంపెనీల క్యాపెక్స్ (మూల ధన వ్యయం) గైడెన్స్, బ్యాలెన్స్ షీట్ డాటా, నగదు రాబడిపై అంచనాలు, నెలకు ఒక ఉద్యోగిపై సగటు ఖర్చు.. ఆధారంగా కనిపిస్తున్న గణితమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
భారతీయులపై ఎఫెక్ట్ ఏంటి?
వాస్తవానికి భారతీయులపై ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండబోతున్నది. దేశ విదేశాల్లో భారతీయులు, ప్రత్యేకించి తెలుగు టెకీలు అత్యధికంగా ఉన్నారు. MAG7 కంపెనీలుగా చెప్పేవాటిలోనే వేల మంది భారతీయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారతదేశం నుంచి హెచ్1బీ వీసాపై వెళ్లి పనిచేస్తున్నవారు అత్యధికంగా ఉన్నారు. అంతేకాదు.. ఏఐతో భారతదేశంలోని రెసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. మిడ్‌లెవల్ మేనేజర్, సపోర్ట్ ఫంక్షన్స్‌లో పనిచేసేవారు హై రిస్క్ క్యాటగిరీలో ఉన్నారు. మొత్తంగా ఏఐ/ఇన్‌ఫ్రా రోల్స్‌లో ఉన్నవారు సురక్షితంగా ఉన్నప్పటికీ.. నాన్ కోర్ టీమ్స్ మాత్రం ప్రమాదంలో ఉన్నట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.
