అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘మేం ఓడిపోలేదు. నేను రాజీనామా చేయను. నేను రాజ్‌భవన్‌కు వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాబోదు’ అని కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మమత చెప్పారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు డెరెక్ ఒ బ్రైన్, అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు.
వాస్తవానికి ఫలితాల వెల్లడి పూర్తి అయిన తర్వాత అధికార పార్టీ ఓడిపోతే.. ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి.. రాజీనామా పత్రాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే.. మమత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ప్రధాన నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకున్నారని మమత ఆరోపించారు. తమ పార్టీ తదుపరి చర్యలపై చర్చించాల్సి ఉందన్న మమత.. నిజ నిర్ధారణ మిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఎన్నికలకు ముందే టీఎంసీ కార్యకర్తలను అరెస్టులు చేశారని మమత ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను విలన్‌గా ఆమె అభివర్ణించారు. ప్రజాస్వామిక హక్కులను, ఈవీఎంలను లూటీ చేశారని ఆరోపించారు. ‘ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలో ఇంకా 80 నుంచి 90 శాతం చార్జింగ్ ఉండటం ఎలా సాధ్యం?’ అని ప్రశ్నించారు. ‘ఎన్నికలకు రెండు రోజులు ముందు మా వాళ్లను అరెస్టుచేయడం మొదలు పెట్టారు. ప్రతిచోటా రెయిడ్స్ చేశారు’ అని మమత అన్నారు.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
‘ముఖ్యమంత్రిని గవర్నర్ నియమించాలి. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను గవర్నర్ నియమించాలి. గవర్నర్ ఇష్టానుసారం మంత్రులు తమ పదవుల్లో కొనసాగుతారు’ అని రాజ్యాంగంలోని 164వ అధికరణం చెబుతోంది. అంటే టెక్నికల్‌గా ఒక రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిస్మిస్ చేయవచ్చు. కానీ ఇది ఇష్టానుసారం చేసేది మారకుండా కొన్ని రక్షణలు కూడా రాజ్యాంగం కల్పించింది. అసెంబ్లీ పదవీకాలం ఇంకా ఉండగానే ఒక ముఖ్యమంత్రిని తప్పుకోమని చెప్పి, మరొకరిని ఆ పదవికి గవర్నర్ ఆహ్వానిస్తే.. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలి. సభలో ఉన్న సగానికిపైగా ఎమ్మెల్యే నిర్ణయం కీలకం. ఎవరూ ఆ మెజార్టీ పొందలేక పోతే చివరిగా 356 అధికరణం ఉపయోగించి.. రాష్ట్రపతిపాలన విధిస్తారు.
ప్రస్తుతం మమతా బెనర్జీ రాజీనామా చేసేందుకు నిరాకరిస్తే.. గవర్నర్ ఆమె రాజీనామాను కోరవచ్చు. ఇక్కడ అసెంబ్లీ కాలపరిమితి కూడా ముగిసిపోయింది. ముందుగా రద్దు కాని పక్షంలో ప్రతి అసెంబ్లీ అప్పాయింటెడ్ డే మొదలుకుని ఐదేళ్లపాటు కొనసాగుతుంది. ఈ ఐదేళ్ల కాలపరిమితికి కొనసాగింపు ఉండదు. ఆటోమెటిక్‌గా ఆ అసెంబ్లీ రద్దయిపోతుంది. ఎన్నికల కమిషన్ వర్గాల ప్రకారం.. బెంగాల్ అసెంబ్లీ 2021 మే 8వ తేదీన ప్రారంభమై.. 2026 మే 7వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త అసెంబ్లీ ఏర్పాటు ప్రక్రియపై సంప్రదింపులను గవర్నర్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంటే.. తాజాగా ఎన్నికైన వారు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు. వారు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.
