పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేషుడు!

ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. గణేశుడి విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది.గణేషుడికి ఇరువైపుల ఓ వైపు సోమనాథుడి జ్యోతిర్లింగం, మరోవైపు కాళీ మాత విగ్రహాలు ఉంటాయి. 69అడుగుల మట్టి విగ్రహాన్ని తయారుచేసే పనులకు గురువారం కర్రపూజతో అంకురార్పణ చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jun 25, 2026, 7:34 pm IST
Read Time: 3 mins
పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేషుడు!

విధాత, హైదరాబాద్ : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవాలకు నిర్వాహకులు అంకురార్పణ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం ఘనంగా కర్రపూజ చేసి విగ్రహ తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది  పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలో  ఖైరతాబాద్ బడా గణేషుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

గణేశుడి విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ఇందులో వినాయకుడికి ఓ వైపు సోమనాథుడి జ్యోతిర్లింగం , మరోవైపు కాళీ మాత విగ్రహాలు ఉంటాయి. 69 అడుగులతో ఖైరతాబాద్ గణేషుడి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ ఏడాదితో ఖైరతాబాద్‌లో బడా గణేశుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తికానున్నాయి. ఖైరతాబాద్ లో ప్రతి ఏడాది బడా గణేషుడి విగ్రహాన్ని సరికొత్తగా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఉత్సవ కమిటీ సన్నాహాలు చేస్తుంది. సెప్టెంబర్ 14న వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఖైరతాబాద్ బడా గణేషుడి దర్శనం కోసం ఏటా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుండం విశేషం.