నల్లగొండలో నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..!

నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆస్తి వివాదంతో కుటుంబ సభ్యులే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 25, 2026, 5:08 pm IST
Read Time: 3 mins
నల్లగొండలో నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..!

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇటీవల ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మరణం వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. సుల్తాన్ (45), హసీన (40), ముజమిల్ (20), అపోరా (11)లను కుటుంబ సభ్యులే హత్య చేశారని, ఆస్తి వివాదమే హత్యలకు కారణమని పోలీసుల విచారణలో తేల్చారు. హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు, అతడి అక్క కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

సుపారీ ఇచ్చి హత్య..

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీషీటర్లతో నిందితులు హత్యలు చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్యకు గురైన హసీన పేరుపై కోటి రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆస్తిని తమకు కాకుండా ప్రస్తుత భర్త సుల్తాన్ పిల్లలకు ఇవ్వాలనే నిర్ణయంపై కక్ష పెంచుకుని.. హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు, అతడి అక్కలు సుపారీ ఇచ్చి దారుణ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో సుల్తాన్ శరీరంపై 6 కత్తిపోట్లు, హసీనపై 7 కత్తిపోట్లు, అపోరాపై 9 కత్తిపోట్లు, ముజమిల్‌పై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నాయని తేలింది. హంతకులు అతికిరాతకంగా వారిని హత్య చేశారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు విచారణ క్రమంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.