కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతల అరిగోస

మొత్తం ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్రమంతా కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనేక చోట్ల కొనుగోళ్ళు జాప్యమవుతున్నాయి. వరి కోతలు మొదలై నెల రోజులు దాటినా కొనుగోళ్లు ఇప్పటికీ నెమ్మదిగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నదాతలంటే… ఈ పాలకులకు ఎందుకింత నిర్లక్ష్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరుగాలం, రాత్రనక, పగలనక.. గాలికి, నీటికి, వర్షానికి, ఆఖరికి అగ్నికి ఆహుతి కాకుండా పసిపాపోలే కండ్లల్లో ఒత్తులు వేసుకుని పండిస్తున్న పంట ఉత్తత్తులను చేతికొచ్చిన తర్వాత కొనుగోలు చేయడంలో ప్రభుత్వాలు ఎందుకీ నిర్లక్ష్యవైఖరిని కొనసాగిస్తున్నాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వస్తువును ఉత్తత్తి చేసే పారిశ్రామిక వేత్తలు కూడా తమ వస్తువుకు తామే ధర నిర్ణయించుకుని, తామే ఎంతకు విక్రయిస్తే అంత ధర పెట్టి కొనుగోలు చేస్తుంటామనీ, కానీ రైతులు పండించే పంట ఉత్పత్తుల్లో వారికి ధర నిర్ణయించుకునే స్వేచ్ఛలేక పోగా, సకాలంలో పంట ఉత్పత్తులను సైతం కొనుగోలు చేయక రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పంట చేలల్లో పడే కష్టం కంటే… సరుకును అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో రైతులు పడే అవస్థలు, అడ్డంకులు, అన్యాయం అంతా ఇంతా కాదంటున్నారు. ఇంత చేస్తే కాళ్ళుపట్టుకున్నంత పనిచేసి ఉత్పత్తులను విక్రయించుకోవాల్సి వస్తోందంటూ ఆత్మగౌరవం అభాసుపాలైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఒక ఏడాది, రెండేళ్ళు ఇబ్బంది వచ్చిదంటే ఏమోగానీ, ప్రతీ ఏటా రైతుకెందుకు ఈ గోస తప్పడంలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తేడా లేకుండా రైతుల పంట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. రైతుల పంట ఉత్పత్తులను ఉత్తి పుణ్యానికి కొనుగోలు చేసినట్లు ప్రభుత్వాలు, పాలకులు మాట్లాడాన్ని చూసి విస్తుపోతున్న సందర్భాలున్నాయి. ఏ నాయకున్ని కదిలించినా నిత్యం రైతు పక్షపాతమంటూ భజన చేయడం అలవాటుగా మారిందంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి సీజన్ లో పంట ఉత్పత్తులు అమ్ముకొనేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. మొన్నటి వరకు పసుపు రైతులు, ఎర్రజొన్నల రైతులు, శెనగ రైతులు ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుతం ధాన్యం, మక్కల రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో అరిగోస పడుతున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల, గాలివానల నుంచి పంటను కాపాడుకోవడం వారికి నిత్య పరీక్షగా మారుతున్నది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీని విపక్షాలు విమర్శించడం, అధికారంలోకి రాగానే ఆ పార్టీలు రైతులను విస్మరించడం షరామాములుగా మారిందని అన్నదాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతాంగ సమస్యలు పాలక పక్షాలకు ఓట్లు దండుకునే అంశాలుగా మారాయనే విమర్శిస్తున్నారు.

తాము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్, బీజేపీలు రైతుల సమస్య కోసం అండగా నిలుస్తున్నట్టు మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. గతంలో బీఆర్ఎస్, బీజేపీని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. పార్టీలు ఏవైనా ఏటా రైతుల సమస్యలు మాత్రం తప్పడంలేదు. కడుపుమండిన రైతులు గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతూ రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు.

మొత్తం ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్రమంతా కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనేక చోట్ల కొనుగోళ్ళు జాప్యమవుతున్నాయి. వరి కోతలు మొదలై నెల రోజులు దాటినా కొనుగోళ్లు ఇప్పటికీ నెమ్మదిగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. పారదర్శకత పేరుతో చేపట్టిన ఆన్లైన్ నమోదు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ నిర్వహణ లోపంతో జాప్యమవుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు కొనుగోలు కేంద్రంతో రైతు మృత్యువాతపడిన సంఘటన తెలిసిందే. అకాలవర్షాల వల్ల ఆరబోసిన ధాన్యం, మక్కలు నీటిపాలై రైతులు లబోదిబోమంటున్నారు. ఈ వారం రోజుల పాటు రాష్ట్రంలో ప్రభుత్వం రైతు వారోత్సవాలు నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ 6వ తేదీన వరంగల్ లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహణకు సిద్ధం కావడం గమనార్హం.

13.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

రాష్ట్రంలో 2026 యాసంగి సీజన్‌లో సుమారు 22.25 నుండి 22.87 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఈ సీజన్‌కు 148 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 152 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన రకం, 60 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ రకం ఉంటాయని అంచనాతో ఉన్నారు. ఈ లెక్కన ఇంకా 77లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అంటే.. కనీసం 10శాతం కూడా కొనుగోళ్లు పూర్తికాలేదని అర్థమవుతున్నది. మంత్రి చెబుతున్న ప్రకారమే కొనుగోలు కేంద్రాల్లో 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నప్పటికీ గన్నీ బ్యాగుల కొరత, కాంటాల జాప్యం, నాణ్యత, వాహనాల కొరత పేరుతో కొనుగోలు ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటున్నది.

ఈ నెల 2వ తేదీ వరకు 12.38 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి, 1.54 లక్షలకు పైగా రైతులకు కనీస మద్దతు ధర (MSP) కింద రూ.1,129.43 కోట్లను నేరుగా బదిలీ చేసినట్టు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ధాన్యం కొనుగోలుకు 8,575 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు 4,455 కేంద్రాలు, 3,563 ఐకేపీ సెంటర్లు, 557 ఇతర కేంద్రాల ద్వారా 5.07 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన ధాన్యాన్ని , 7.31 లక్షల మెట్రిక్ టన్నుల ముతక ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు మొత్తం 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరి చేరగా ఇప్పటి వరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సన్నరకం ధాన్యానికి క్వింటాల్ కు రూ. 500 బోనస్ ప్రభుత్వంచెల్లిస్తోంది.

ధాన్యం ఉత్తత్తిలో నెంబర్ వన్

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని తెలంగాణ కైవసం చేసుకుంది. ఇదే రికార్డును తాజాగా కొనుసాగిస్తోంది. గతంలో ఉన్న పంజాబ్ రికార్డును కూడా అధిగమించింది.

మొక్క జొన్న రైతుల అవస్థలు

తెలంగాణలో మొక్కజొన్న ఒక ప్రధాన వాణిజ్య పంటగా సాగుచేస్తున్నారు. వరి తర్వాత అత్యధికంగా సాగు చేస్తున్నారు. వానాకాలం, యాసంగిలో నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. 2025–26 యాసంగి సీజన్‌లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 6.70 లక్షల ఎకరాలకు పైగా సాగు నమోదైంది. డిమాండ్ కారణంగా కొన్నిసార్లు మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలుకుతున్నా, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌లో మొక్కజొన్న ఎక్కువ దిగుబడి రావడంతో కొనుగోళ్ళు జాప్యమవుతున్నాయి. దీంతో రైతులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో మక్కలతో సహజీవనం చేస్తున్నారు. ఇదే అదనుగా దళారీలు రంగ ప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోళ్ళు వేగవంతం చేసి తమను ఆదుకోవాలని మక్కల రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మక్క రైతులకు అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెబుతున్నప్పటికీ కొనుగోళ్ళలో ఆ వేగం లేదంటున్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం : మంత్రి ఉత్తమ్

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, రైతుల నిరసనలు, విపక్షాల విమర్శల నేపత్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం పెరిగింది. పపీస కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, హమాలి, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకస్మిక వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని వెంటనే రైతులు ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను నిరంతరం అందించాలని, జిల్లా స్థాయిలో తగినన్ని టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. మెరుపు,వానల సమయంలో రైతులు కరెంట్ స్తంభాలు, పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

Latest News