హైలైట్స్:
- వచ్చే ఐదేళ్లు తెలంగాణలో 5 లక్షల ఎకరాలు చొప్పున కట్
- ఆ స్థానంలో ప్రత్యమ్నాయ పంటలకు ప్రోత్సాహం
- నీతి ఆయోగ్ ఆదేశాలు దాచి పెడుతున్న రాష్ట్రం!
విధాత, హైదరాబాద్:
వరి వేస్తే ఉరే అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రానున్న ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఎకరాల చొప్పున వరి సాగు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు హుకుం జారీ చేసింది. అంటే ప్రతి సంవత్సరం ఐదు లక్షల చొప్పున వరి వేయడం మానేయాలి. ఈ విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి. మొత్తం మూడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ విధించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను ప్రజలకు స్పష్టం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దాచి పెడుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ బహిర్గతం చేయకుండా పంట మార్పిడి అంటూ కూని రాగాలు తీస్తూ రైతులను మరింత అయోమయంలోకి నెట్టి వేస్తున్నదని అంటున్నారు.
గత వానకాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 167.75 లక్షల ఎకరాలు, పశ్చిమ బెంగాల్ 105.66 లక్షల ఎకరాలు, తెలంగాణ లో 69.90 లక్షల ఎకరాల్లో సాగు అయ్యింది. పొరుగున ఉన్న ఏపీలో 42.67 లక్షల ఎకరాలు కాగా తమిళనాడులో అతి తక్కువగా 18.53 లక్షల ఎకరాల్లో మాత్రం వరి వేశారు. అయితే యాసంగిలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో అతి స్వల్పంగా సాగు చేయగా తెలంగాణలో మాత్రం గణనీయంగానే 59.90 లక్షల ఎకరాల్లో వరి నాటారు. తెలంగాణలో రెండు సీజన్లలో కలిపితే 129.80 లక్షల ఎకరాల్లో వరి సాగి జరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అత్యధిక వరి సాగులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉండగా రెండో స్థానంలో తెలంగాణ ఉంది.
దిగుబడి అయిన తరువాత కొనుగోళ్ల విషయంలో రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దిగుబడి అయిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్రాలు పట్టుబడుతుండడం కేంద్రానికి తలనొప్పిగా మారింది. వరి సాగు పెరగడం మూలంగా ప్రభుత్వాలపై భారం పెరగడమే తప్ప రైతుకు ప్రయోజనం ఉండడం లేదనేది కేంద్ర వ్యవసాయ శాఖ వాదనగా ఉంది. వరి కోసం పెద్ద ఎత్తున భూగర్భ జల వనరులు వినియోగించడం, విద్యుత్, కనీస మద్ధతు ధర అమలు చేయాల్సి వస్తున్నది. వరి కోసం నిత్యం జలాలను మడులకు వదలాల్సి ఉంటుంది. నీటి పారకం లేకుంటే పంట ఎండిపోతుంది. అదే విధంగా దీని కోసం రైతులు ఉచిత విద్యుత్ ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారనేది ప్రధాన అభియోగం. దిగుబడి అయిన తరువాత ప్రభుత్వమే కొనుగోళ్ళు చేయాలని రాష్ట్రాలు ఒత్తిడి చేయడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఇదంతా ఒక సమస్య అయితే బోనస్ ప్రకటించడం మూలంగా రాష్ట్రాల ఖజానాపై ఆర్థిక భారం పెరగుతోంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని లాభ, నష్టాలు బేరీజు వేసిన తరువాత నీతి ఆయోగ్ రాష్ట్రాలకు వరి సాగుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
2026-27 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఐదు లక్షల ఎకరాల చొప్పున వరి సాగు నిలిపివేయాలని నీతి ఆయోగ్ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. వచ్చే ఐదు సంవత్సరాల పాటు అమలు చేయాల్సిందేనని తన ఆదేశాల్లో పేర్కొంది. ఇలా నియంత్రించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని, వారిలో చైతన్యం తెచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఈ ఐదు లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు మూలంగా రైతుకు ఆదాయం పెరగడంతో పాటు ప్రభుత్వం పై భారం తగ్గుతుందనేది నీతి ఆయోగ్ అంచనా. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు అర్థం అయ్యేలా తెలియచేయడంలో పూర్తిగా విఫలమైంది. కేంద్రం జారీ చేసిన ఆదేశాలు దాచి పెట్టడం మూలంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు రైతులకు నష్టం చేకూర్చినట్లు అవుతుంది. ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ సన్నాయి నొక్కులు నొక్కుతుంది కాని విస్పష్టంగా ప్రకటన చేయడం లేదు. దీని వల్ల రైతుల్లో గందరగోళ పరిస్థితి కల్పిస్తూ ప్రభుత్వం పట్ల మరింత వ్యతిరేకతను పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నీతి ఆయోగ్ జారీ చేసిన ఆదేశాలను రైతులకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది.