ఓ వైపు బలుచిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమం..బలూచ్ ఆర్మీ గెరిల్లా దాడులతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు తాజాగా పీవోకే( పాక్ ఆక్రమిత కశ్మీర్) రూపంలో మరో తలనొప్పి మొదలైంది. పీవోకేలో వేర్పాటు వాద ఘర్షణలు మళ్లీ చెలరేగడంతో అక్కడ 30 మందికిపైగా ఆందోళన కారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పీవోకే లో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.
పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. ఈ క్రమంలో బింబేర్, కొట్లీ, ముజాఫర్‌బాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక నేత అంత్యక్రియల్లో సైన్యాన్ని ప్రజలు ఎదిరించడంతో ఘర్షణలు చెలరేగాయి. పాక్ సైన్యం ఆందోళనకారులపైకి కాల్పులకు దిగింది. ఈ ఘర్షణల్లో 30 మందికిపైగా పౌరులు మృతి చెందగా, మరో 200 మంది గాయపడినట్లుగా పాక్ సైనిక వర్గాల సమాచారం. ఇంటర్నెట్ బంద్ చేసి ,సెర్చ్ ఆపరేషన్లను చేపట్టింది.మంగళవారం ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC) పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారీ మార్చ్ కు పిలుపునిచ్చింది.
అయితే జాక్ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై తీవ్ర నిబంధనలు విధించింది. ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, ప్రాంతంలో అరాచకం సృష్టిస్తోందని ఆరోపిస్తూ దీనిని యాంటీ టెర్రరిజం చట్టం పరిధిలోకి తెచ్చింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ర్యాలీపై అణిచివేత చేపట్టింది. దీంతో ఆందోళనలు మరింత ముదిరాయి.
పాకిస్తాన్ ఇప్పటికే తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), బలూచ్ తిరుగుబాటుదారులు, అఫ్గాన్ తాలిబాన్ వంటి తీవ్రవాద శక్తులతో బహుముఖ పోరాటం చేస్తోంది. భద్రతా దళాల వనరులను ఆయా సరిహద్దు ప్రాంతాలకు తరలించడం వల్లే పీఓకేలో పరిస్థితి చేయి దాటిందని నిపుణులు భావిస్తున్నారు. లాక్‌డౌన్ విధిస్తారన్న భయంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. మొత్తం మీద పీవోకేలు ప్రజలు ఆందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.