• Telugu News
  • /Telangana

తెలంగాణలో చెరకు సాగు పెంచాలి: సీఎస్ సంజయ్ జాజు

రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతో పాటు చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 29, 2026, 8:54 pm IST
Read Time: 5 mins
తెలంగాణలో చెరకు సాగు పెంచాలి: సీఎస్ సంజయ్ జాజు

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతో పాటు చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల పునరుద్ధరణ, చెరకు పంట విస్తీర్ణం పెంపు కోసం ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 86 ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చెరకు రైతు ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 12 చక్కెర కర్మాగారాలు ఉండగా ప్రస్తుతం 7 కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే ఏటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరమవుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు.

వరి పంటతో పోలిస్తే చెరకు సాగుకు తక్కువ నీరు అవసరమవుతుందని, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తే దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. 2026–27 వ్యవసాయ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 19 వేల మంది రైతులు 26 వేల హెక్టార్లలో చెరకు సాగు చేస్తున్నట్లు తెలిపారు.

చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు, చక్కెర పరిశ్రమలకు అవసరమైన ముడి చెరకు లభ్యతను మెరుగుపరచేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

సమావేశంలో రైతు ప్రతినిధులు మాట్లాడుతూ, చెరకు రైతులకు కూడా వరి రైతులకు అందిస్తున్న తరహాలో టన్నుకు రూ.500 ప్రోత్సాహకం అందించాలని కోరారు. చెరకు సాగులో అధిక పెట్టుబడి, వ్యవసాయ కూలీల కొరత రైతులకు ప్రధాన సవాళ్లుగా మారాయని వివరించారు. చెరకు ద్వారా చక్కెరతో పాటు ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమవుతుందని పేర్కొంటూ, ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.