విధాత: తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైన రాజమహేంద్రవరంతో హిట్ ఆండ్ రన్ ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిచెందారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ఆదివారం సాయంత్రం ధ్రువీకరించారు.
ఎంబీబీఎస్ పూర్తిచేసిన ప్రియాంక.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ప్రియాంక స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్యమాల్‌లో సినిమా చూసి, సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
రద్దీ కారణంగా వాహనాలు థియేటర్ గేటు వద్ద ఆగగా.. అదే సమయంలో నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌లు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. కిందపడిపోయిన ఆమెపైనుంచి కారును తీసుకెళ్లడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తొలుత వైద్య చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ప్రియాంక ను ఢీ కొట్టిన నిందితులపై పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు దశ్వంత్, ఆండ్రూలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.