Drink Nutmeg Milk at Night for Better Sleep: A Natural Remedy Backed by Ayurveda
విధాత ఆరోగ్యం డెస్క్ | హైదరాబాద్:
Nutmeg Milk | ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తోంది. పని ఒత్తిడి, మొబైల్ స్క్రీన్‌లకు అలవాటు, అసమయ భోజనం, శారీరక శ్రమ లేకపోవడం—ఇలాంటి కారణాల వల్ల రాత్రి పడుకున్నాక కూడా నిద్ర పట్టడం లేదు. సరైన నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఇలాంటి సమయంలో సహజంగా నిద్రను మెరుగుపరచే పద్ధతులపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. అలాంటి చిట్కాల్లో ఒకటి—గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగడం. ఆయుర్వేదంలో జాజికాయను.. శాంతపరచే గుణాలు కలిగిన మసాలాగా భావిస్తారు. ఇది శరీరాన్ని రిలాక్స్ చేసి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
నిద్రకు ఎలా ఉపయోగపడుతుంది?
పాలలో జాజికాయ కలిపితే సహజ నిద్ర చిట్కాగా పనిచేస్తుంది
పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం మెదడులో సెరోటోనిన్(serotonin), మెలటోనిన్(Melatonin) హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవే నిద్రను నియంత్రించే ముఖ్య హార్మోన్లు. మరోవైపు జాజికాయలోని మిరిస్టిసిన్ నాడీ వ్యవస్థపై శాంతిదాయక ప్రభావాన్ని చూపించి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రెండు కలిసి పనిచేసి శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు ఈ పాలను తీసుకుంటే త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
రాత్రి జాజికాయ పాలు తాగితే నిద్ర మెరుగుపడుతుందని నిపుణుల సూచన. తేనె కూడా కలుపుకోవచ్చుఋ
జాజికాయ పాలు నిద్రకే కాకుండా జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. జాజికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా కొంతమేర ఉపయోగపడొచ్చు. అదనంగా, స్వల్ప యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల కీళ్ల నొప్పులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇది జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుందని ఆయుర్వేదం అంటోంది. అలాగే పాలు, జాజికాయ పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని , ప్రతిరోజు మొహానికి రాసుకుంటే చర్మ సమస్యలు(Skin Diseases) రావని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ముఖ్య ప్రయోజనాలు:
- 🔴 నిద్రలేమి సమస్య తగ్గుతుంది
- 🔴 ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుంది
- 🔴 జీర్ణక్రియ మెరుగుపడుతుంది
- 🔴 శరీరం రిలాక్స్ అవుతుంది
- 🔴 మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది
- 🔴 జుట్టు బాగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
ఎలా తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
జాజికాయ పొడి చిటికెడు మాత్రమే వాడటం మంచిది
ఒక గ్లాసు పాలను గోరువెచ్చగా వేడి చేసి అందులో చిటికెడు జాజికాయ పొడిని కలిపి పడుకునే 30 నిమిషాల ముందు తాగాలి. కావాలంటే కొద్దిగా తేనె లేదా ఏలకుల పొడి కూడా కలుపుకోవచ్చు. తాజా జాజికాయను గ్రేట్ చేసి వాడితే మరింత మంచి ఫలితం లభిస్తుంది.
అయితే జాజికాయను ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. రోజుకు చిటికెడు మాత్రమే వాడాలి. ఎక్కువగా తీసుకుంటే మత్తు, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. గర్భిణీలు, చిన్నపిల్లలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి. ఇది ఏదైనా వైద్య సమస్యలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.
మొత్తానికి, రాత్రి గోరువెచ్చని పాలలో జాజికాయ కలిపి తాగడం ఒక సులభమైన, సహజమైన నిద్ర చిట్కా. సరైన మోతాదులో వాడితే ఇది నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే దీన్ని ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి పాటిస్తేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చు.
జాజికాయతో పాటు జాపత్రి (జవిత్రి) కూడా ఆరోగ్యకరం
అన్నట్లు దీనికో తమ్ముడున్నాడు. వాడి పేరు జాపత్రి. ఒకే చెట్టు, ఒకే ఫలం నుండి వేర్వేరు లక్షణాలు, ధర్మాలు కలిగిన మసాలా దినుసులు రావడం అరుదు. ఇది జాజికాయను అల్లుకుని ఉండే పోగుల్లాంటి పదార్థం. జాజికాయ, జాపత్రి రెండూ వేర్వేరు సుగంధం కలిగిఉంటాయి. మన బిర్యానీలో ఇవి రెండూ లేకపోతే అసలా ఘుమఘుమలే ఉండవు. ఇంట్లో కూడా మాంసాహార వంటకాల్లో ఇవి తప్పసరిగా వాడాల్సిందే.
