SS Rajamouli
విధాత: ఒకరిపై ప్రేమనే భావన మనసులో కలిగాకా అది ఎదుటి వారికి చెప్పే వరకూ పెద్ద బరువు మోస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా మామూలు వారికే కాదు వాళ్ళు ఎంత గొప్పవారైనా అదే ఫీలింగ్ ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి విషయంలోనూ ఇదే జరిగిందట. ఈ విషయం స్వయంగా రాజమౌళినే చెప్పుకొచ్చాడు.
సినిమాలకు పరిచయం అవుతున్న తొలి రోజులవి. రమాను మొదటిసారి చూసినపుడు ఇంప్రెస్ అయ్యి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. కానీ అది సాధ్యం అవుతుందా? ఇది నిజంగానే ప్రేమా? లేక ఆకర్షణా? అనే అనుమానం కలిగేదట. సోషల్ మీడియా ముఖంగా తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉండే రాజమౌళి తాజాగా తన ప్రేమ గురించి పంచుకున్నారు.
సినిమా రంగంలో జయాపజయాలనేవి పక్కపక్కనే ఉంటాయి. ప్రతి పరిస్థితినీ తట్టుకుంటూ ఎదురొడ్డి నిలబడగలగడం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. అలాంటిది రాజమౌళి దానిని సాధించి చూపించాడు. తెలుగు సినిమా స్థాయిని దేశ దేశాల్లోనూ నిలిపిన ఘనత అతనికే సొంతం.
సినిమారంగంలోనే కాదు వ్యక్తిగత విషయంలోనూ విజయమే అందుకున్నాడు. తన ప్రేమను బయట పెట్టాకా తన అభిరుచుల గురించి ముఖ్యంగా తన సినిమా ఇష్టాన్ని కూడా చెప్పి.. తనకు తోడుగా నిలవడానికి ఆమెను ఒప్పించి పెళ్లి పీటలెక్కాడట రాజమౌళి.
అలా తన జీవితంలోకి రమా రాజమౌళి రావడాన్ని ఈ దర్శకధీరుడు గుర్తు చేసుకున్నారు. అటు సినిమాను, ఇటు పర్సనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మొత్తానికి కెరియర్లో రమాతో పాటు అడుగులు వేయడం నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. రాజమౌళి ప్రేమ కబుర్లు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.