Site icon vidhaatha

అది చెట్టా..బోరు బావినా..!?

tree-spouts-water-like-well-bottle-tree-phenomenon

విధాత : వేప చెట్ల నుంచి కల్లు కారడం..కొన్ని వృక్ష జాతుల చెట్ల నుంచి నీళ్లు వెలువడిన ఘటనలు అరుదుగా వెలుగు చూస్తుంటాయి. భైరవ ద్వీపం అనే తెలుగు సినిమాలో హీరో ఓ జల వృక్షం నుంచి ఔషద జలాలను సాధించడం అద్బుత సన్నివేశంగా చూశాం. అయితే ఓ దేశంలో ఏకంగా ఓ చెట్టు నుంచి బోరు బావి నీళ్లు ఎగిసిపడినట్లుగా..జలపాతం నుంచి నీళ్లు జలజలా పారినట్లుగా ధారాళంగా నీళ్లు వెలువడిన సంచలన ఘటన అందరిని విస్మయానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అడవిలో ఓ భారీ వృక్షాన్ని సగం వరకు నరికివేయగానే.. చెట్టు కాండం మధ్య భాగం నుంచి నీటి ఊట వెలువడటం మొదలైంది. క్రమంగా ఈ నీటి ప్రవాహం పెరిగి బోరు బావి నుంచి ఎగజిమ్మినట్లుగా నీళ్లు బయటకు వరదలా పారాయి. కొన్ని నిమిషాల వరకు నీటి ప్రవాహం కొనసాగి ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నప్పటికి అది ఏ దేశంలో జరిగిందన్నదానిపై స్పష్టత లభించలేదు.

అయితే మెటోనాగ్రో దేశంలో డిసోనా గ్రామంలో టొమెంటోసా వృక్షం నుంచి వచ్చే నీరు ఊరంతా పారుతుంది. 150ఏండ్ల నుంచి ఈ చెట్టు నుంచి నీళ్లు వానకాలంలో వరదలా వస్తుంటాయి. ఏటా ఎందరో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు వస్తుంటారు. శాస్త్రవేత్తలు అనేక పరిశోధనల పిదప వర్షం కురిసిన తర్వాతా భూమిలోకి వెళ్లిన నీరు భూ పొరలలోని నీటి బుగ్గలలోని ఒత్తిడితో చెట్టుకు ఉన్న రంధ్రంలోంచి వెలువడుతున్నట్లుగా గుర్తించారు. మరికొన్ని చెట్లు తమలోనే నీటిని ఇముడ్చుకుని పెరుగుతాయి. ఏపీలోని అల్లూరి సితారామరాజు జిల్లాలో ఏడాది క్రితం పాపికొండలు నేషనల్‌ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్‌ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో నల్లమద్ధి చెట్టు నుంచి 20లీటర్ల నీరు వెలువడిన ఘటన అప్పట్లో వైరల్ గా మారింది. నల్లమద్ది చెట్లకు నీటి నిల్వ లక్షణం ఉంటుందని గుర్తించారు.

ప్రకృతిలో సహజంగా బేవోబాబ్‌ అనే శాస్త్రీయ నామంతో కూడిన ఎడారి చెట్టు నీళ్లను తనలో దాచుకునే లక్షణం కలిగి ఉంటుంది. మడగాస్కర్‌ సహా ఆఫ్రికాలోని 32 దేశాల్లో పెరిగే ఈ బేవో బాబ్ చెట్టును బాటిల్‌ ట్రీగానూ.. ట్రీ ఆఫ్‌ లైఫ్‌’గానూ పిలుస్తారు. దాదాపు 1,20,000 లీటర్ల నీటిని బేవో బాబ్ చెట్టు తన కాండంలోని స్పాంజ్‌లాంటి నిర్మాణం సాయంతో నిల్వ చేసుకుంటుంది. వేల సంవత్సరాలు బతికే ఈ చెట్టు కాండాలు తర్వాతా డొల్లగా మారిపోయినప్పటికి చెట్టు అలానే జీవిస్తుంటుంది. డొల్లగా మారిన ఈ చెట్టు కాండం లోపల జంతువులతో పాటు కొన్ని చోట్ల మనుషులూ కూడా అవాసాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. మడగస్కర్ ఆదివాసీలు ఈ చెట్టు తొర్రలను నీళ్ల ట్యాంకులుగా కూడా వాడుకుని నీటి నిల్వ చేసుకుంటుంటారు.

Exit mobile version