BYD Denza Z9GT | 5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ కారు.. ఆటోమొబైల్ రంగంలో సంచలనం

BYD Denza Z9GT | ఆటోమొబైల్ రంగంలో చైనాకు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ బీవైడీ సంచలనం సృష్టించబోతుంది. కేవలం ఐదు నిమిషాల్లోనే 70 శాతం వరకు చార్జ్ అయ్యేలా సరికొత్త Denza Z9GT ప్రీమియం లగ్జరీ బ్రాండ్‌ను తీసుకొస్తోంది. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

BYD Denza Z9GT | ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలపై జనాలకు ఆసక్తి పెరిగిపోతుంది. కానీ చార్జింగ్ పెట్టడానికే గంటలు గంటలు ఎదరుచూడాల్సి వస్తుందని చాలామంది ఈవీ కార్లను కొనుగోలు చేయడానికి వెనుకా ముందు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ అడ్డంకిని అధిగమిస్తూ చైనాకు చెందిన ప్రముఖ ఈవీ కార్ల తయారీ సంస్థ బీవైడీ సరికొత్త టెక్నాలజీతో కొత్త కారును తీసుకొస్తుంది. తన ప్రీమియం బ్రాండ్ అయిన డెంజా నుంచి జెడ్9 జీటీ ( Denza Z9GT ) మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది. యూరప్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కారును తీసుకొస్తుంది.

ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్

బీవైడీకి చెందిన Denza Z9GT మోడల్ కారులో ప్రత్యేకత ఏంటంటే.. మెరుపు వేగంతో చార్జింగ్ అవ్వడం. ఇందులో వాడిన ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే 10 నుంచి 70 శాతం వరకు బ్యాటరీ రీచార్జి అవుతుంది. అదే 9 నిమిషాల్లో 97 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. అంటే సాధారణంగా మనం బంక్‌లో పెట్రోల్ కొట్టించడానికి పట్టే సమయానికి సమానమనే చెప్పొచ్చు. ఇంత స్పీడ్‌గా చార్జింగ్ అవ్వడానికి బీవైడీ బ్లేడ్ బ్యాటరీ 2.0 (122kWh) బ్యాటరీని ఉపయోగించారు. దీనివల్ల గడ్డ కట్టే-30 డిగ్రీల సెల్సియస్ చలిలో కూడా ఇంతే మెరుపు వేగంతో చార్జింగ్ పూర్తవుతుందని బీవైడీ కంపెనీ తెలిపింది.

సింగిల్ చార్జ్‌తో 800 కి.మీ. ప్రయాణం

ఫ్లాష్ చార్జింగ్‌తో పాటు వేగంలో కూడా ఈ కారు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ కారును ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 497 మైళ్లు అంటే.. సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ కారులో ట్రై మోటార్ వెర్షన్‌ను ఉపయోగించారు. ఇది దాదాపు 1000 హార్స్ పవర్ సామర్థ్యానికి అందిస్తుంది. దీనివల్ల ఈ కారు కేవలం మూడు సెకన్లలోనే 100 kmph వేగాన్ని అందుకుంటుంది.

టార్గెట్.. యూరప్ మార్కెట్‌

యూరప్‌లోని లగ్జరీ కార్ల మార్కెట్‌ను చైనాకు చెందిన బీవైడీ టార్గెట్ చేసింది. డెంజా బ్రాండ్‌తో అక్కడి పోర్షే టైకాన్ ( Porsche Taycan ) వంటి లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు గట్టి పోటీనివ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే సరికొత్త టెక్నాలజీతో ఈవీ Denza Z9GT కారును తీసుకొస్తుంది. ఇక చైనాలో ఇప్పటికే 4239లో ఫ్లాష్ చార్జింగ్ స్టేషన్లను బీవైడీ ఏర్పాటు చేసింది. 2026 నాటికి ఆ సంఖ్యను 16 వేల వరకు విస్తరించాలని ప్లాన్ చేసింది. దీంతో పాటు యూకేలో ఈ ఏడాది 300 ఫ్లాష్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ ఫ్లాష్ చార్జింగ్ స్టేషన్ల ద్వారా ప్రస్తుతం ఉన్న ఈవీ చార్జర్ల కంటే మూడు రెట్లు వేగంగా చార్జి చేయవచ్చని బీవైడీ కంపెనీ చెబుతోంది.

వచ్చే నెలలో అధికారిక ప్రకటన

Denza Z9GT మోడల్ కారు ధర, ఫీచర్లను ఇంకా బీవైడీ అధికారికంగా ప్రకటించలేదు. ఏప్రిల్ 8వ తేదీన పారిస్‌లో జరగబోయే ఈవెంట్‌లో ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. కాగా, ఈవీ కార్లకు చార్జింగ్ సమయం ఎక్కువగా పట్టడం కారణంగానే వీటిని కొనుగోలు చేసేందుకు చాలామంది మొగ్గు చూపడం లేదు. అలాంటిది Denza Z9GT మోడల్ బంక్‌లో పెట్రల్ కొట్టించేందుకు పట్టే టైమ్‌లో చార్జి అవుతుందని చెబుతుండటంతో ఇది ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ మోడల్ మన భారత మార్కెట్‌లోకి వస్తుందో లేదో చూడాలి.!

Read More:

Kia Sonet 2026 | 10 లక్షల్లోపే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ SUV.. 2026 కియా సోనెట్ కొత్త వేరియంట్లు వచ్చేశాయి!

Hyundai Verna | హ్యుందయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది.. కొత్తగా వచ్చిన ఫీచర్లు, హైసెక్యూరిటీ వివరాలివే!

Latest News