Harish Rao: విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనుడు రేవంత్ రెడ్డి

అతి తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యా శాఖ మంత్రి, ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

  • Publish Date - September 14, 2025 / 05:15 PM IST

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విధాత): అతి తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యా శాఖ మంత్రి, ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్‌లు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లరి చేయొద్దు అని ఆర్థిక మంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి కమీషన్లు దండుకోవడంపై ఉన్న ధ్యాస, విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు పై లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి అని అని హరీశ్ రావు ప్రశ్నించారు. గ్రీన్ చానెల్ లో నిధుల విడుదల అన్న మీ మాటలు నీటి మూటలేనా అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి లేని డబ్బులు ముఖ్యమంత్రి కమిషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే ‘నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు’ అని చెప్పిన ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీకి 20వేల కోట్ల టెండర్లు, మూసిలో గోదావరి నీళ్లు పోసేందుకు 7000 కోట్ల టెండర్లు, జిహెచ్ఎంసిలో హై లెవెల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు మరో ఏడు వేల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నాడన్నారు. కమిషన్లు దండుకునేందుకు రెండున్నర లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్న రేవంత్ రెడ్డి.. విద్యార్థుల చదువు పట్ల నీకు శ్రద్ధ లేదా? విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆలోచన లేదా అని ధ్వజమెత్తారు.

ఫీజు రియంబర్స్మెంట్ విషయమై బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని, ఏ ఏడాదికి ఆ ఏడాది క్లియర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం సిగ్గులేకుండా మాట తప్పిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్ధిక మాంద్యాల్లోనూ ఫీజు రీయింబర్సు మెంటు ఆపలేదు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ గారి పాలనలో 20 వేల కోట్లు ఫీజు రీయింబర్సు మెంటు చెల్లించామన్నారు.

కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి. పెద్దమొత్తంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యాసంస్థలు నడిపించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో సగానికి సగం జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయన్నారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ రాక, మరోవైపు ఫీజు బకాయిలు పేరుకు పోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.