Site icon vidhaatha

ఆది శ్రీనివాస్ : సీఎం రేవంత్ రెడ్డి దమ్మున్నోడు..మాకు ఫోన్ ట్యాపింగ్ అవసరం లేదు

revanth-reddy-phone-tapping-brs-adi-srinivas-response-telangana-politics

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులపైన, సొంత పార్టీ నాయకులపైన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపించడాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొట్టిపారేశారు. మా నాయకుడు రేవంత్ రెడ్డి దమ్మున్నోడని..ఆ అవసరం ఆయనకు లేదని స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. మీలాగ ట్యాపింగ్ చేసి పరిపాలన చేసే వ్యక్తిత్వం మా నాయకుడిది కాదన్నారు. మాకు మా నాయకుల మీద నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరు దొంగే దొంగ అన్నట్టు ఉందని..10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయిన దొంగలు ..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా సొంత ప్రత్రికలో రోత రాతలు రాస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో భార్యాభర్తలు, సినీతారలు, జడ్జిలు మాట్లాడిన కాల్స్‌ ట్యాప్‌ చేశారని..సొంత పార్టీ నేతలతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ దొంగల పాపం పండి..లోక్ సభ ఎన్నికలో గుండు సున్నాకు పరిమితమయ్యారన్నారు. ఫోన్ ట్యాపింగ్..కాళేశ్వరం పై విచారణజరుగుతోందని..సూత్రధారులు, పాత్రధారులు పాత్ర తేలాల్సి ఉందని.. కలుగులో దాక్కున్నా కూడా నిందితులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకొని పోతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో సినీతారలు, జడ్జీలు, భార్య భర్తలు మాట్లాడుకున్న మాటలను విన్నారని కల్వకుంట్ల కవితే బహిరంగంగా చెబుతున్నారని శ్రీనివాస్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని.. నియంతృత్వ పోకడలు ఎక్కువ అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అని..మా మంచి పాలనను ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో నైతిక విలువలతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని.. ఫోన్ ట్యాపింగ్ బురద కాంగ్రెస్ పార్టీకి అంటించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కేటీఆర్ లోకేష్ తో భేటీ అయ్యారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని.. వారి భేటీకి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేదన్నారు. గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా బీజేపీ-బీఆర్ ఎస్ మధ్య వ్యవహారం సాగుతుందని ఆరోపించారు.

మాజీ సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీనుంచి తెలంగాణ పదం తొలగించిన రోజే పేగు బంధం తెగిపోయిందన్నారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందన్నారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతూ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు 200 కోట్ల ప్రయోజనం కలిగిందని, పదేళ్ల హయంలో పది రేషన్ కార్డులు కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదన్నారు. పదేళ్లలో ఏ ఒక్క నియోజక వర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇచ్చిన పాపాన పోలేదని, ధనిక రాష్ట్రం కాస్తా 7 లక్షల కోట్లకు అప్పులు కట్టే దుస్థితిలోకి బీఆర్ఎస్ పాలకులు తీసుకెళ్లారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధి నిరూపించుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేసే బీఆర్ ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదన్నారు.

Exit mobile version