Site icon vidhaatha

AFG Vs BAN | బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్థాన్ అద్భుత విజయం.. ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు ఆవిరి..

AFG Vs BAN : టీ20 వరల్డ్ కప్‌ (T20 world cup -2024) లో ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌పై సంచలన విజయంతో తొలిసారి వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం (జూన్ 25న) బంగ్లాదేశ్‌తో హోరీహోరీగా సాగిన సూపర్‌-8 మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్‌-1లో భారత్‌ తర్వాత స్థానంలో నిలిచి సెమీస్‌లోకి దూసుకొచ్చింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 105 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. గ్రూప్‌-1లో టేబుల్‌ టాపర్‌గా నిలిచి భారత్ ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక గ్రూప్-2 లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకున్నాయి.

ఆఫ్ఘనిస్థాన్‌ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. పేసర్లు ఫజల్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్ విజృంభించడంతో 23 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సౌమ్య సర్కార్, లిటన్ దాస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సౌమ్య సర్కార్ ఔటయ్యాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు లిటన్ దాస్ (54) క్రీజులో పాతుకుపోయాడు. ఆఫ్ఘన్‌ సెమీస్‌ ఆశలపై నీళ్లు చల్లేలానే కనిపించాడు. కానీ హాఫ్ సెంచరీ చేసి క్రీజులో ఉన్నా.. మరో ఎండ్‌లో బ్యాటర్‌లు ఆఫ్ఘన్‌ బౌలింగ్‌ ధాటికి నిలువలేకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు.

Exit mobile version