Site icon vidhaatha

CM Revanth Reddy | ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ‌లో నిర్వహించండి

CM Revanth Reddy | ఖేలో ఇండియా గేమ్స్‌-2026ను తెలంగాణ‌లో నిర్వహించాల‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియాతో పాటు జాతీయ క్రీడ‌లు, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల‌కు ఆతిథ్యమిచ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. కేంద్ర మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌ను ఢిల్లీలోని ఆయ‌న అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం క‌లిశారు. ఖేలో ఇండియా కింద క్రీడా మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ‌, క్రీడా నిపుణుల‌ ఎంపిక ఇత‌ర కార్యక్రమాల‌కు నిధులు కేటాయించాల‌ని కోరారు. భువ‌న‌గిరిలో సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్‌, మ‌ల్టీప‌ర్పస్ ఇండోర్ స్టేడియం, రాయ‌గిరిలో స్విమ్మింగ్ పూల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని పాల‌మూరు యూనివ‌ర్సిటీలో సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్‌, క‌రీంన‌గ‌ర్ శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీలో మ‌ల్టీపర్పస్ హాల్‌, హైద‌రాబాద్ హ‌కీంపేట్ లో అర్చరీ రేంజ్‌, సింథ‌టిక్ హాకీ ఫీల్డ్‌, ఎల్‌.బి.స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేచుర‌ల్ ఫుట్‌బాల్ ఫీల్డ్ అభివృద్ది, సింథటిక్ ట్రాక్‌, గ‌చ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ న‌వీక‌ర‌ణ‌, న‌ల్గొండ మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీలో సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాల‌కు రూ.100 కోట్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వ‌స‌తుల మెరుగుకు అన్నివిధాలా కృషి చేస్తోంద‌ని… కేంద్ర ప్రభుత్వం నుంచి త‌గిన స‌హ‌కారం ఇవ్వాల‌ని సీఎం కోరారు. 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్‌లో క‌నీసం రెండు ఈవెంట్లు తెలంగాణ‌లో నిర్వహించాల‌ని కోరారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల‌కు గ‌తంలో మాదిరే రైలు ప్రయాణాల్లో ఛార్జీ రాయితీ ఇవ్వాల‌ని సీఎం కోరారు. స‌మావేశంలో రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు (క్రీడ‌లు) ఏ.పీ జితేంద‌ర్ రెడ్డి, ఎంపీలు మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, కేంద్ర ప‌థ‌కాలు, కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల స‌మ‌న్వయ‌ కార్యదర్శి గౌర‌వ్ ఉప్పల్, అధికారుల పాల్గొన్నారు.

Exit mobile version