Mallu Bhatti Vikramarka | ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం నిర్వహణపై బిజినెస్ రూల్స్ ఉంటాయి. మంత్రి మండలి సమవేశానికి ఎవరిని అనుమతించాలి? అది కూడా ఎప్పుడు అనుమతించాలి? అనేదానిపై నిర్ధిష్టమైన నిబంధనలు ఉన్నాయి. వీటిని ఉల్లంఘించడానికి అవకాశం లేదు. కానీ.. క్యాబినెట్ సమావేశం జరిగే సమయంలో తన కార్యదర్శిని పూర్తిసమయం అనుమతించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై ఏం చేయాలో అర్థం కాక జీఏడీ అధికారులు జుట్టు పట్టుకున్నట్లు సమాచారం. సచివాలయంలో ఈ నెల 5వ తేదీన మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, సచివాలయంలోని కార్యదర్శులు హాజరయ్యారు. సచివాలయం నిబంధనల ప్రకారం మంత్రి మండలి సమావేశానికి ముఖ్యమంత్రి కార్యదర్శులను మాత్రమే లోనికి అనుమతిస్తారు. మంత్రుల కార్యదర్శులు, ఇతర అధికారులను ఎవరినీ కూడా లోనికి ఎట్టి పరిస్థితుల్లో పంపించరు. ఎజెండా అంశం ఉంటే సంబంధిత కార్యదర్శిని పిలిపించి మాట్లాడి, వివరణ తీసుకున్న తరువాత తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇది నిబంధనల ప్రకారమే జరుగుతూ ఉంటుంది.
సీనియర్ అధికారుల మధ్య చర్చ
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు స్పెషల్ సెక్రెటరీగా డీ కృష్ణ భాస్కర్ పనిచేస్తున్నారు. ఈ నెల 5న జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగే హాలు వద్దకు భాస్కర్ కూడా వచ్చారు. ఆయనను కూడా మంత్రి మండలి సమావేశం హాలులోకి అనుమతించాలని జీఏడీ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారని సీనియర్ అధికారుల మధ్య చర్చ జరుగుతున్నది. నిబంధనల ప్రకారం మంత్రుల కార్యదర్శులు, డిప్యూటీ సీఎం కార్యదర్శులను లోనికి అనుమతించరని అక్కడి అధికారులు చెప్పినా.. ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా లోనికి అనుమతించాలని గట్టిగా చెప్పారని సమాచారం. ఏం చేయాలో అర్థం కాక ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లగా, అవునని, కాదని కూడా చెప్పకుండా ఆయన సైతం మిన్నకుండిపోయారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇదే తరహా అనుభవం గత మంత్రి మండలి సమావేశాల్లో కూడా జీఏడీ అధికారులకు ఎదురైందని అంటున్నారు. కానీ.. ఈసారి కొంత సీరియస్ అయినట్లు తెలుస్తున్నది.
సీఎంకు ఉండే ప్రొటోకాల్ నాకూ!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ విధంగా ప్రొటోకాల్ ఉంటుందో అదే తరహాలో తనకూ ప్రొటోకాల్ ఉండాలని పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల వద్ద భట్టి విక్రమార్క ఆమోదం తీసుకున్నారనే చర్చలు ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో డిప్యూటీ సీఎం చాంబర్ ముందు పొలీస్ పికెట్, బయటకు వెళ్లినప్పుడు సెక్యురిటీ, వ్యక్తిగత సిబ్బందిని కూడా ఏమాత్రం తగ్గకుండా నియమించుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీపీఆర్వో ఉన్న విధంగా మల్లు భట్టి విక్రమార్కకు కూడా సీపీఆర్వో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యదర్శి తరహాలోనే తన కార్యదర్శిని కూడా లోనికి అనుమతించాలని భట్టివిక్రమార్క పట్టుబట్టి ఉంటారని అధికారవర్గాల్లో చర్చలు చోటుచేసుకుంటున్నాయి.