Iran Attack on Qatar Gas Hub: Big Threat to India’s Energy Security
విధాత ప్రపంచం డెస్క్ | 19 మార్చి 2026 | హైదరాబాద్:
Iran Attack on Qatar Gas Hub: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయి. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవరూప సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ – LNG) కేంద్రంగా పేరుగాంచిన రస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేసింది. ఈ పరిణామం భారత్‌కు ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే మన దేశం గ్యాస్‌ను ఎక్కువగా ఇక్కడినుంచే దిగుమతి చేసుకుంటోంది.
భారత్ మొత్తం చమురు అవసరాల్లో సుమారు 88 శాతం దిగుమతులపై ఆధారపడుతుండగా, గ్యాస్ అవసరాల్లో దాదాపు సగం విదేశాల నుంచే వస్తోంది. ఇందులో ఖతార్ కీలక భాగస్వామి. ఇలాంటి సమయంలో రస్ లఫాన్‌పై దాడి జరగడం కేవలం తాత్కాలిక అంతరాయం కాదు, దీర్ఘకాలిక ప్రభావాలను కలిగించే పెను ప్రమాదంగా నిపుణులు భావిస్తున్నారు.
రస్ లఫాన్ ప్రాధాన్యం.. భారత్పై ప్రభావం
ప్రపంచ అతిపెద్ద గ్యాస్ కేంద్రంపై దాడి ప్రభావం – దీర్ఘకాలం ఇబ్బందులు తప్పవా..
ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా ఉన్న రస్ లఫాన్ పారిశ్రామిక నగరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతి కేంద్రం. ఇక్కడే భారీ స్థాయిలో గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్టోరేజ్ ట్యాంకులు, ఎగుమతి టెర్మినల్స్ ఉన్నాయి.
భారత్‌కు వచ్చే ఎల్ఎన్జీలో సుమారు 40–47 శాతం ఖతార్ నుంచే వస్తోంది. అలాగే వంటగ్యాస్ సరఫరాలో కూడా ఖతార్ వాటా దాదాపు మూడో వంతు. ఈ నేపథ్యంలో అక్కడి ఉత్పత్తి ఆగిపోతే భారత్‌కు గ్యాస్ సరఫరాలో భారీ లోటు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దాడి కారణంగా భారత్‌కు వచ్చే గ్యాస్ సరఫరాలో సుమారు 20 శాతం అంతరాయం ఏర్పడిందని అంచనాలు చెబుతున్నాయి. దాదాపు 47 MMSCMD (Million Metric Standard Cubic Meters per Day) వరకు సరఫరా ప్రభావితమయ్యే పరిస్థితి నెలకొంది.
భారత్‌లో రోజువారీ గ్యాస్ వినియోగం 189 MMSCMD ఉండగా, దేశీయ ఉత్పత్తి కేవలం 90 MMSCMD మాత్రమే. మిగతా భాగం దిగుమతులపైనే ఆధారపడటం వల్ల ఈ అంతరాయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ధరల పెరుగుదల.. ప్రత్యామ్నాయాల కోసం భారత్ ప్రయత్నాలు
రస్ లఫాన్‌పై దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరిగాయి. భారత క్రూడ్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు $140 దాటింది. బ్రెంట్ క్రూడ్ కూడా గణనీయంగా పెరిగింది. సరఫరా కొరతను ఎదుర్కొనేందుకు భారత్ గ్యాస్‌ను ప్రాధాన్యత రంగాలకు మళ్లిస్తోంది. గృహ వినియోగం (LPG), వాహన ఇంధనం (CNG) కోసం సరఫరా కొనసాగిస్తూ పరిశ్రమలు, విద్యుత్ రంగాలకు కోతలు విధించే పరిస్థితి ఏర్పడింది.
భారత్ ఖతార్‌తో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, గెయిల్, జీఎస్పీసీ సంస్థల ద్వారా దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్రోనెట్ ఒక్కటే సంవత్సరానికి 7.5 మిలియన్ టన్నుల LNG దిగుమతి చేస్తోంది. అయితే ఉత్పత్తి ఆగిపోవడంతో ఈ ఒప్పందాల అమలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ గల్ఫ్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా వంటి దేశాల నుంచి LNG కొనుగోళ్లు పెంచుతోంది. కానీ ఈ మార్గం ఖర్చుతో కూడుకున్నది. ఇక ఖతార్‌తో భారత్‌కు ఉన్న వాణిజ్య సంబంధాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. 2024-25లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం $14 బిలియన్ దాటింది. ఇందులో ఎక్కువ భాగం ఇంధన దిగుమతులే.
కట్టెలపొయ్యిలు, కిరోసిన్ స్టవ్‌లు.. ఆలోచించండి : కేంద్రం
ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి ఆలోచించాల్సిందిగా కేంద్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కట్టెలపొయ్యిలు, కిరోసిన్ స్టవ్‌లు, ఇండక్షన్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లవంటివాటివైపు దృష్టి సారించాలని ఇంధన శాఖ సూచించింది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కేవలం యుద్ధం పరిమితిలోనే ఉండడం లేదు. ఇప్పుడు అవి నేరుగా ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. రస్ లఫాన్‌పై దాడి భారత్‌కు ఒక హెచ్చరికగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఇంధన వనరుల వైవిధ్యీకరణ అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
