Vijay | తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ చిత్రం జన నాయగన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రాజకీయాల కారణంగా ఈ సినిమా చుట్టూ భారీ చర్చ నడుస్తుండగా, తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో సినిమా టైటిల్ కార్డ్‌పై “తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్” అనే టెక్స్ట్ కనిపించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. థియేటర్లలో ఈ టైటిల్ కనిపించగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో నిజంగానే సినిమాలో ఇలాంటి టైటిల్ ఉంటుందా? లేక ఇది ఫ్యాన్స్ రూపొందించిన ఎడిటెడ్ వీడియోనా? అనే సందేహాలు మొదలయ్యాయి.
రకరకాల ఊహాగానాలు..
అయితే ఈ వీడియో అసలైనదేనా లేదా AI టెక్నాలజీ సహాయంతో రూపొందించిందా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మూవీ టీమ్ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఈ చిత్రానికి దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజకీయ అంశాలతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. సినిమా కథలో రాజకీయ నేపథ్యం బలంగా ఉండటంతోనే సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయని, అందుకే విడుదల ఆలస్యం అవుతోందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
భారీ అంచనాలు..
ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, ప్రతినాయకుడిగా బాబీ డియోల్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదట ఈ సినిమాను పొంగల్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ప్రక్రియ ఆలస్యమవడంతో రిలీజ్ వాయిదా పడినట్లు సమాచారం. ప్రస్తుతం మే 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రై కగజం ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 234 స్థానాల్లో 108 సీట్లు గెలుచుకోవడంతో విజయ్ అభిమానులు భారీ సంబరాలు చేసుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అవుతారనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీపై ఇంకా స్పష్టత లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
India’s first time CM title card for actor ! #TVKVijay 🥵🥵 pic.twitter.com/vHqDuRenku
— 𝗚𝗥𝗜𝗠_𝗦𝗣𝗘𝗖𝗧𝗘𝗥 ᴶᴱᴱⱽᴬ (@leodas_jeeva) May 6, 2026
