Tiny but Deadly… How Iran’s ‘Majid’ is Challenging the World’s Top Air Force
సారాంశం :
రాడార్ లేకుండా పనిచేసే ‘మజీద్’ మిసైల్ సిస్టమ్ విమానాల వేడిని గుర్తించి దాడి చేసే చిన్న సాంకేతికత. చిన్నదైనా, ఈ నిశ్శబ్ద గగనతల వ్యవస్థ ఆధునిక యుద్ధ విమానాలకు కూడా పెనుగండంగా మారుతోంది.
విధాత ప్రపంచం డెస్క్ | హైదరాబాద్:
Majid Air Defence System: ప్రపంచ గగనతల యుద్ధాల్లో ఆధిపత్యం అంటే ఇప్పటివరకు అమెరికానే గుర్తుకొచ్చేది. అత్యాధునిక గుప్త సాంకేతికత, శక్తివంతమైన యుద్ధ విమానాలు, అత్యాధునిక రాడార్ వ్యవస్థలు—ఇవన్నీ కలిసి అమెరికాను గగనతలంలో అజేయంగా నిలబెట్టాయి. కానీ ఇటీవలి పరిణామాలు ఈ సమీకరణాన్ని ప్రశ్నించేలా మారుతున్నాయి. ఇరాన్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన ‘మజిద్’ గగనతల రక్షణ వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువుగా నిలిచింది. ఈ అతి చిన్నవ్యవస్థ, తన పని తీరుతో పెద్ద దేశాల సాంకేతిక ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది. అత్యాధునిక 5వ తరం గుప్త విమానం ఎఫ్–35 మనుగడను ప్రశ్నార్థకం చేసింది.
‘మజిద్’ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
వేడి ఆధారంగా లక్ష్యాన్ని ఛేదించే మజీద్ మిసైల్ వ్యవస్థ దాడి దృశ్యం
ఈ పరిణామాల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న పేరు ‘మజిద్’ (AD-08) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇరాన్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఈ చిన్న తరగతి రక్షణ వ్యవస్థను 2021లో సైనిక పరేడ్‌లో మొదటిసారి ప్రదర్శించారు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు లక్ష్యాలను దగ్గర నుంచి కూల్చివేయడానికి రూపొందించిన ఈ వ్యవస్థను పాయింట్ డిఫెన్స్‌గా ఉపయోగిస్తారు. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లు వంటి లక్ష్యాలను ఇది ఎదుర్కొనేలా రూపొందించబడింది.
సాధారణంగా గగనతల రక్షణ వ్యవస్థలు రాడార్ ఆధారంగా పనిచేస్తాయి. కానీ ‘మజిద్’ పూర్తిగా భిన్నమైన విధానాన్ని అనుసరిస్తుంది. ఇది ఎలాంటి రాడార్ సిగ్నల్‌ను విడుదల చేయదు. దాంతో శత్రు విమానాలు తమ పైకి వస్తున్న మజిద్ మిసైళ్లను గుర్తించలేవు. ఆ విమానాల ఇంజిన్ నుంచి వెలువడే వేడిని గుర్తించే పరారుణ(ఇన్‌ఫ్రారెడ్) సెన్సర్లను ఉపయోగించడం వల్ల అవి దాడి నుంచి తప్పించుకునే అవకాశాలు దాదాపు మృగ్యం. ఫలితం.. ఎంత అత్యాధునిక యుద్ధ విమానమైనా బలి కావాల్సివస్తోంది. రాడార్‌కు కనిపించకుండా పని చేయగల సామర్థ్యం దీన్ని ఒక ‘నిశ్శబ్ద’ మారణాయుధంగా మార్చింది.
రాడార్ లేకుండా దాడి.. ‘నిశ్శబ్ద’ సాంకేతికత రహస్యం
దాడుల తీవ్రతను చూపుతున్న విమాన అవశేషాలు, ధ్వంసమైన భాగాలు
‘మజిద్’ వ్యవస్థ ప్రత్యేకత ఇదే. రాడార్ లేకపోవడం వల్ల ఇది శత్రువు దృష్టికి అందడం చాలా కష్టం. విమానాలు సాధారణంగా రాడార్ సిగ్నల్స్‌ను గుర్తించి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇక్కడ అలాంటి అవకాశం ఉండదు. పైగా శత్రు విమానం నుంచి వచ్చే వేడిని ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు గుర్తించి వెంటాడి వేటాడతాయి.
ఈ వ్యవస్థను చిన్న 4×4 వాహనాలపై అమర్చడం వల్ల ఇది తేలిగ్గా కదులుతుంది. ఒకచోట దాక్కుని ఉండి, సరైన సమయంలో దాడి చేసి వెంటనే మరోచోటికి వెళ్లిపోగలదు. ఈ విధానాన్ని “షూట్ అండ్ స్కూట్” అని పిలుస్తారు. సుమారు 700 మీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వరకు దాడి చేయగల ఈ మజిద్ క్షిపణి, 6 కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను ఛేదించగలదు. ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల ద్వారా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని గుర్తించగలదు. ఒకేసారి అనేక లక్ష్యాలను ట్రాక్ చేసి దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉంది.
ఈ కారణాల వల్ల ఆధునిక యుద్ధవిమానాలకు కూడా ఇది ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఎగిరే సమయంలో మజిద్ నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా మారుతోంది.
గుప్త విమాన యుగానికే సవాల్? గగనతల యుద్ధంలో కొత్త పరిణామం
మజిద్ ధాటికి యుద్ధరంగంలో కూలిపోయిన హెలికాప్టర్లు, దాడుల ప్రభావం స్పష్టంగా
ఇటీవలి నివేదికల్లో, ఇరాన్ ఈ వ్యవస్థతో అమెరికా యొక్క ఆధునిక F-35 Lightning II స్టెల్త్ విమానాన్ని కూడా కూల్చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్ ఫోటోలు, వీడియోలు విడుదల చేసినా, అమెరికా మాత్రం నోరు మెదపలేదు. అయినప్పటికీ, ఈ చర్చ వెనుక ఉన్న సాంకేతిక వాస్తవం మాత్రం గమనించదగ్గది. గుప్త(స్టెల్త్) విమానాలు రాడార్‌కు కనిపించకుండా ప్రయాణించగలవు కానీ, ఇంజిన్ నుంచి వెలువడే వేడిని పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు. ఇదే అంశాన్ని ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థలు ఉపయోగించుకుంటాయి.
ఇక ఇరాన్ వ్యూహంలో మరో ముఖ్య ఆయుధం మొబైల్ లాంచర్లు. స్థిరమైన రక్షణ కేంద్రాల బదులు, ఎక్కడికైనా తక్షణం తరలించగల వ్యవస్థలను ఉపయోగించడం వల్ల శత్రువుకు వాటిని గుర్తించడం కష్టమవుతోంది. భూగర్భ సొరంగాలు, పర్వత ప్రాంతాల్లో ఆయుధాలను దాచడం కూడా ఈ వ్యూహంలో భాగమే. దీంతో గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించడం ఇక అంత సులభం కాదన్న అభిప్రాయం బలపడుతోంది.
ప్రపంచంలో అత్యాధునిక ఫైటర్ జెట్లు – ఎఫ్-15ఈ, ఎఫ్-35 విమానాలు
మొత్తానికి, ‘మజిద్’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చిన్నదైనా, యుద్ధరంగంలో పెద్ద మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. రాడార్ లేకుండా, వేడి ఆధారంగా పనిచేసే ఈ ‘నిశ్శబ్ద’ టెక్నాలజీ భవిష్యత్ గగనతల యుద్ధాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే అవకాశముంది. అలాగే ఇరాన్ ప్రయోగిస్తున్న చిన్న చిన్న డ్రోన్లను ఎదుర్కోవడానికి అత్యంత ఖరీదైన పేట్రియాట్ క్షిపణులను వాడాల్సిరావడం కూడా అమెరికాకు తలనొప్పిగా మారింది.
