- తెలంగాణలోనూ ప్రవేశిస్తుందా?
- మజ్లీస్‌కు మింగుడుపడని ముస్లిం లీగ్ ఫలితాలు
విధాత, హైదరాబాద్:
కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంల్) సత్తా చూపించింది. కేరళలో 22 సీట్లను గెలుపొందగా, తమిళనాడులో రెండు సీట్లను కైవసం చేసుకున్నది. ఈ పార్టీ మద్దతు కోసం టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ వెంపర్లాడుతున్నారు. దేశంలోని ముస్లింలకు తానే పెద్దన్ననంటూ ప్రచారం చేసుకుంటున్న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహుదుల్ ముస్లిమీన్) అధినేత, ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి దీటుగా తయారవుతున్నారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ మజ్లిస్ పార్టీని మించి ముస్లిం ఎమ్మెల్యే, ఎంపీలను కలిగి ఉన్న పార్టీగా అవతరించింది. రానున్న రోజుల్లో ముస్లిం లీగ్ తెలంగాణలో ఖాతా తెరిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
1948లో ఏర్పాటు
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1948లో తమిళనాడు రాజధాని నాటి మద్రాస్ నగరంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పురుడు పోసుకున్నది. 1951 సంవత్సరంలో దీన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంల్)గా మార్చారు. ఈ పార్టీ తమిళనాడుతో పాటు కేరళ రాష్ట్రాలకు విస్తరించింది. ముస్లింలు దీన్ని వాడుక భాషలో ముస్లిం లీగ్ అని పిల్చుకుంటారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కేరళ రాష్ట్రంలో దీనిని రాష్ట్ర పార్టీగా గుర్తించింది. లోకసభలో ముగ్గురు సభ్యులు, రాజ్యసభలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. కేరళ రాష్ట్రంలో యూడీఎఫ్‌లో, తమిళనాడులో ఎస్పీఏ, జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కొనసాగుతున్నది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఇరవై రెండు మంది, తమిళనాడు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. 2017 నుంచి ఈ పార్టీ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన కేఎం ఖాదర్ మొహిద్దీన్ వ్యవహరిస్తున్నారు. మొత్తంగా దేశంలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ఉన్నారు. మజ్లిస్ పార్టీకి తెలంగాణలో ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. బీహార్‌లో ఐదుగురు, మహారాష్ట్రలో ఒకరు గెలువగా, తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేసి ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. మొత్తంగా ఈ పార్టీకి దేశవ్యాప్తంగా 13 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఏ రకంగా చూసినా ముస్లిం లీగ్‌కు ఉన్న బలం, ఓటు బ్యాంకు కూడా ఎంఐఎంకు లేదనేది స్పష్టమవుతున్నది.
ఎల్డీఎఫ్‌ను దెబ్బకొట్టిన ముస్లిం లీగ్
కేరళలో సీపీఎం, సీపీఐలకు చెందిన 11 మంది అభ్యర్థులపై ముస్లిం లీగ్ అభ్యర్థులు గెలుపొందారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు బీజేపీ అభ్యర్థులను ఓడించారు. ఒకరు చొప్పున ఐఎన్ఎల్, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ అభ్యర్థులను మట్టికరిపించారు. ప్రధానంగా 11 మంది సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన వారు ఓడిపోవడం ఆ పార్టీలకు మింగుడు పడటం లేదు. ముస్లిం ఓటర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రక్షణగా ఉన్నప్పటికీ ఐయూఎంల్‌ను ఆదరించి, కమ్యూనిస్టులను ఓడించడాన్ని నేతలను ఆలోచనలో పడేసిందంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీపీఎం, సీపీఐ తమ ఆలోచనలకు పదునుపెట్టి పూర్వ వైభవం సాధిస్తారా లేదా చతికిల పడతారా అనేది వేచిచూడాల్సి ఉంది.
తమిళనాడులో స్వల్ప మెజారిటీ
తమిళనాడులో ఇద్దరు ముస్లిం లీగ్ అభ్యర్థులు టీవీకేపై విజయం సాధించారు. వనియంబాద్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిపై 2982 ఓట్లు, పాపనాశంలో 1065ఓట్లతో గెలుపొందడం గమనార్హం. తమిళనాడులో పార్టీ పుట్టినప్పటికీ, డీఎంకేతో ఉన్న సన్నిహిత సంబంధాల మూలంగా తన బలాన్ని విస్తరించుకోలేక పోతున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమైంది. డీఎంకే అధినేత స్టాలిన్‌ను ఎంఐఎం నాయకత్వం కలిసింది. ఈ దోస్తానాపై అక్కడి ముస్లిం లీగ్ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో, డీఎంకే వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో మజ్లిస్ అక్కడ పోటీ చేయకుండా మిన్నకుండి పోయింది.