AIMIM Different Strategies | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ అందుకేనా?

ఎంఐఎం ఎక్కడ పోటీచేసినా.. అది అంతిమంగా బీజేపీకే లబ్ధికలిగేలా ఉంటుంది. గతంలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దీనిని రుజువు చేశాయి. తాజాగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎంఐఎం బరిలో దిగుతుండటంతో అది బీజేపీకి మేలు చేసేందుకేనా? అన్న ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి.

AIMIM Different Strategies | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ అందుకేనా?

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

AIMIM Different Strategies | కాంగ్రెస్‌, ఎంఐఎం మధ్య రెండు రాష్ట్రాల్లో రెండు రకాల విధానాలు చర్చకు దారి తీస్తున్నాయి. తెలంగాణలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇక్కడ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ.. కీలకమైన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లలో పోటీ చేస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో దోస్తానా చేస్తూ బీహార్‌లో కుస్తీకి దిగడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కలిసి ఇండియా బ్లాక్‌ పేరుతో బరిలో నిల్చున్నాయి. ఇక్కడ బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమి పార్టీలు శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలో కీలకమైన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం ఎన్డీయే అభ్యర్థులను గెలిపించేందుకేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థులను ఓటమికి కారణమైన చరిత్ర ఎంఐఎంకు ఉన్నది. అంతేకాదు.. గత రెండు పార్లమెంటు ఎన్నికలలో ఎంఐఎం పార్టీ అమేథీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి, ఆయన ఓటమికి తాను కూడా ఒక కారణమైందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

బీహార్‌ ఎన్నికల్లో మూడో కూటమి

బీహార్ ఎన్నికల్లో అజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్), అప్ని జనతా పార్టీతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమామ్ తెలిపారు. ఆజాద్ సమాజ్ పార్టీ 25 సీట్లలో, అప్ని జనతా పార్టీ నాలుగు సీట్లలో పోటీ చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో టికెట్లు ఇచ్చిన విధంగా బీహార్‌లోనూ హిందూ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఢాకా నుంచి రాణా రంజిత్, సికంద్ర నుంచి మనోజ్ కుమార్ దాస్‌కు టికెట్లు ఇచ్చారు. రంజిత్… రాజ్‌పుత్‌ కులానికి చెందినవారు. మనోజ్ దళిత నాయకుడు. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలలో 2020 ఎన్నికల్లో ఐదుగురిని నిలబెట్టగా గెలుపొందారు. ఈసారి ముస్లింలు అధికంగా ఉన్న నార్త్, సౌత్ బీహార్‌లో కూడా అభ్యర్థులను నిలబెట్టారు. కిషన్ గంజ్ నియోజకవర్గం నుంచి 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 1,381 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బహదూర్ గంజ్, ఠాకూర్ గంజ్, పూర్ణియా, కటిహార్, అరారియాలో ముస్లిం ఓటు బ్యాంకు గెలుపోటములు నిర్ధేశించే స్థాయిలో ఉంది. 87 అసెంబ్లీ నియోజకవర్గాలలో 20 శాతానికి పైగా, 47 సీట్లలో 15 నుంచి 20 శాతం మధ్య ముస్లిం ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు. ఇందులో 2.3 కోట్ల మంది ముస్లిం ఓటర్లు ఉండగా, సీమాంచల్ లోనే అధికంగా ఉన్నారు. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో ఓటింగ్ జరుగుతుండగా 14వ తేదీన ఓట్లను లెక్కిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 12 ఎన్డీఏ గెలుపొందగా, ఎంఐఎం 5, ఆర్జేడీకి చెందిన మహా ఘట్ బంధన్ 10 సీట్లు మాత్రమే కైవసం చేసుకోగలిగింది. వాస్తవానికి 24 సీట్లలో 20 సీట్లు మహా ఘట్ బంధన్ అభ్యర్థులు గెలవాల్సి ఉండగా, ఎంఐఎం పోటీ మూలంగా ఓడిపోయారనే విశ్లేషణలు ఉన్నాయి. ముస్లిం ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకు, వరద బాధితులను ఆదుకునేందుకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీమాంచల్‌లో ఇటీవలే న్యాయ యాత్ర కూడా నిర్వహించారు.

బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిందనేనా?

తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిందనే ఉద్దేశంతోనే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్ధతు ప్రకటించింది. దీంతో ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బహిరంగ మద్ధతు ప్రకటించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో నవీన్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. పాతబస్తీ ని దాటి నగరంలో కూడా విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు అసదుద్దీన్ ప్రకటన సుస్పష్టం చేస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అసదుద్దీన్ ప్రకటనతో బీఆర్ఎస్ గుర్రుగా ఉన్నది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు తమతో అంటకాగి, స్వంత పనుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపిందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి జై కొట్టడం ఎంఐఎం పార్టీ విధానమని, ప్రజల ఎజెండా కాదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

బీహార్‌లో దూరం పెట్టిన మహా ఘట్ బంధన్

కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు మరికొన్ని పార్టీలు జతకట్టి మహా ఘట్ బంధన్ ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో తమకు బలమున్న చోట ఆయా పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో పెట్టాయి. మహా ఘట్ బంధన్ లో చేరేందుకు అసదుద్దీన్ ఒవైసీ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్.. ఎంఐఎం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో బీహార్ లో పోటీ చేసి ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు సహకరించారని ఆరోపించారు కూడా. రాహుల్ గాంధీ కూడా అసదుద్దీన్ పట్ల ఏమంత సానుకూలంగా లేరని సమాచారం. అమేథీలో ఆయన ఓటమి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న తేజస్వీ, రాహుల్.. కూటమిలోకి రాకుండా అడ్డుకున్నారని అంటున్నారు. ఒకవేళ కూటమిలోకి అనుమతించినా, తమకు సంబంధించిన సమాచారం మొత్తం బీజేపీ పెద్ద నాయకులకు చేరవేస్తారనే భయంతో పొత్తుకు నిరాకరించారంటున్నారు.