KCR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారం కోసం రాబోతారా? కేటీఆర్, హరీశ్ రావు ప్రచార వ్యూహాలు సిద్ధం చేసి మాగంటి సునీత విజయానికి మార్గదర్శనం చేస్తున్నారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ప్రచారానికి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వస్తారా లేదోనన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతుంది. బుధవారం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు లు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార వ్యూహాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైనా చర్చించినట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జిలతో రేపు గురువారం సమావేశం కావాలని కేసీఆర్ ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రచార వ్యూహాలపై ఇంచార్జిలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇక్కడ గెలిస్తేనే భవిష్యత్తు..అందుకే సార్ రావాలి!
కేసీఆర్ స్వయంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తారా లేక మార్గదర్శకత్వానికే పరిమితమవుతారా అన్నదానిపై పార్టీ నాయకత్వం నుంచి స్పష్టత కొరవడింది. ఎన్నికల సంఘంకు సమర్పించిన పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరును చేర్చారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిటింగ్ స్థానం కావడంతో ఈ సీటును నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్తు రాజకీయాల్లో తిరిగి సత్తా చాటేందుకు..అధికార కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు ఈ ఎన్నిక బీఆర్ఎస్ కు కీలకంగా మారింది. అందుకే ఇక్కడ ప్రచారానికి కేసీఆర్ రావాలని కేటీఆర్, హరీష్ రావులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ కు వారు విజ్ఞప్తి కూడా చేశారు. కేసీఆర్ మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయమై ఇప్పటికైతే స్పష్టత ఇవ్వలేదు.
భయపెడుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫలితం
రాజకీయంగా ఎంతో కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ వస్తే పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి దోహదం చేస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో వార్డుల వారిగా రంగంలోకి దిగి పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎదురైన పరిస్థితి జూబ్లీహిల్స్ లో ఎదురవ్వకుండా కేసీఆర్ ప్రచారానికి రావాలని వారంతా కోరుకుంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అప్పటి పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో జరిగిన ఉప ఎన్నికలో సానుభూతిలోనూ కూడా బీఆర్ఎస్ తన సిటింగ్ స్థానాన్ని గెలవలేక కాంగ్రెస్ కు చేజార్చుకుందని..జూబ్లీహిల్స్ లో అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలని బీఆర్ఎస్ నాయకత్వం తలపోస్తుంది.