Bihar Results | బీహార్‌లో ఎంఐఎంతో కాంగ్రెస్ సమానం! చెరొక ఐదు సీట్లలో గెలుపు! ప్రాంతీయ పార్టీలా కాంగ్రెస్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘఠ్ బంధన్‌కు ప్రత్యేకించి కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్.. కేవలం ఐదు సీట్లే సాధించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, విధాత ప్రతినిధి
Bihar Results | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ కనీస ఫలితాలను సాధించలేక పోయింది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగ్గా ఊహించని ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. కేవలం ఐదు స్థానాల్లోనే గెలుపొంది ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారిపోయింది. తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ పాతిక నియోజకవర్గాల్లో పోటీ చేయగా ఐదు సీట్లలో విజయం సాధించింది. మిగతా నియోజకవర్గాల్లో మహా ఘట్ బంధన్ అభ్యర్థులను ఓటమి పాలవడంలో ఎంఐఎం ప్రభావం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలు అయిన హిందుస్థాన్ అవామ్ మోర్చా 5 స్థానాలు, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 స్థానాల్లో గెలుపొందాయి. సీపీఐ (ఎం), బహుజన్ సమాజ్ పార్టీ 1 చొప్పున గెలుపొందగా, సీపీఐ ఎంఎల్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి.
ఆర్జేడీ 27, కాంగ్రెస్ 5 సీట్లలో గెలుపు
సెక్యులర్ పార్టీలు మహా ఘట్ బంధన్‌గా ఏర్పడి 243 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. కూటమిలో కాంగ్రెస్ 61, ఆర్జేడీ 135, సీపీఐ, సీపీఐ ఎంఎల్ పార్టీలు 30, వీఐపీ 15, జేఎంఎం 2, ఐఐపీ 1 సీటు చొప్పున పోటీ చేశాయి. ఆర్జేడీ 135 స్థానాల్లో పోటీ చేయగా 26 స్థానాలు కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేయగా 5 స్థానాల్లో విజయం సాధించింది. వాల్మీకి నగర్‌లో సురేందర్ ప్రసాద్, చన్పాటియాలో అభిషేక్ రంజన్, అరారియాలో అబిదుర్ రహ్మాన్, కిషన్ గంజ్ లో ఎండీ ఖమరుల్ హోడా, మనిహారి లో మనోహర్ ప్రసాద్ సింగ్ విజయం సాధించారు. లెఫ్ట్ పార్టీలు 30 సీట్లలో పోటీపడగా సీపీఎం, సీపీఐ ఎంఎల్ పార్టీలు ఒక్కొక్కటి చొప్పున గెలుపొందాయి. మహా ఘట్ బంధన్ 243 సీట్లకు గాను 31 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.
ఎన్డీఏ ఘన విజయం
ఎన్డీఏలో ఉన్న పార్టీలు బీజేపీ 101, జనతాదళ్ యునైటెడ్ 101, లోక్ జనశక్తి 25, జితన్ రాం మాంఝీ హిందుస్థాన్ అవామ్ మోర్చా 6, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 సీట్ల చొప్పున పోటీ చేశాయి. బీజేపీ 92 స్థానాల్లో, జేడీయూ 82, లోక్ జనశక్తి 19, హిందుస్థాన్ అవామ్ మోర్చా 5 స్థానాలు, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 స్థానాల్లో విజయం సాధించాయి.
తెలంగాణలో మద్ధతు… బీహార్‌లో పోటీ
తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీ నవీన్ యాదవ్‌కు ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ఏ ఒక్క డివిజన్ లో కూడా ఓట్లు తక్కువ రాకూడదని, ప్రతి ముస్లిం ఓటరు కాంగ్రెస్ కు ఓటేయించేలా చూడాలని ముఖ్య నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఓటింగ్ తగ్గితే అందుకు సంబంధిత నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారని కూడా వార్తలు వచ్చాయి. అసదుద్దీన్ ఆదేశాల ప్రకారం కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తో పాటు ముఖ్య నేతలు గల్లీ గల్లీ తిరిగి పోలింగ్ కేంద్రాలకు పురమాయించారు. తెలంగాణ లో మద్దతు పలికిన ఎంఐఎం పార్టీ బీహార్‌లో మాత్రం గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ ఏర్పాటు చేసింది. ఈ అలయన్స్ 64 సీట్లలో తమ అభ్యర్థులను నిల్చొబెట్టింది. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం 35 మంది అభ్యర్థులను పోటీ చేయించింది. ఆజాద్ సమాజ్ పార్టీ 25 సీట్లలో పోటీ చేసింది. జోకిహత్ లో మహ్మద్ ముర్షీద్ అలం, బహదూర్ గంజ్ లో ఎండీ తౌసీఫ్ అలం, కోచాధమన్ లో ఎండీ సర్వర్ అలం, అమోర్ లో అక్తరుల్ ఇమాన్, బైసీ లో గులాం సర్వర్ లు గెలుపొందారు. కనిష్టంగా 14,862 ఓట్లు, గరిష్ఠంగా 38,928 ఓట్లు మెజారిటీ లభించింది.
నష్టపోయిన కాంగ్రెస్, ఆర్జేడీ
బీహార్ లో 2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 19 సీట్లలో గెలుపొందింది. తాజా ఫలితాల్లో ఆర్జేడీ 49 స్థానాలను, కాంగ్రెస్ 14 స్థానాలలో ఓటమి పాలయ్యింది. ఈ సీట్లలో ఏన్డీఏ అభ్యర్థులు పాగా వేయడంతో బలం మరింత పెరిగింది. బీజేపీ 20.90 శాతం ఓట్లు, జేడీయూ 18.92 శాతం ఓట్లు పొందాయి. ఆర్జేడీ 22.76 శాతం పొందినప్పటికీ సీట్లను అధికంగా గెలువలేకపోయింది. అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానంలో జేడీయు ఉన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram