• Telugu News
  • /National

సహజీవనం తప్పు అన్నందుకు కుటుంబాన్నే లేపేసిన కూతురు!

సహజీవనాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు, చెల్లిపై యువతి తన ప్రియుడితో కలిసి కత్తితో దాడి చేసిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. ముగ్గురు మృతి చెందగా నిందితులు పరారీలో ఉన్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 24, 2026, 1:02 pm IST
Read Time: 5 mins
సహజీవనం తప్పు అన్నందుకు కుటుంబాన్నే లేపేసిన కూతురు!

సహజీవనం తప్పమ్మా అని హితవు చెప్పడం నచ్చని కూతురు తన ప్రియుడితో కలిసి తల్లి, తండ్రి, చెల్లిని హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. మానవ సంబంధాల మనుగడను ప్రశ్నార్థం చేసిన ఈ ఘటన వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులకు శ్వేత, సుప్రియ అనే ఇద్దరు కుమార్తెలు.. వారి చదువుల కోసం తల్లిదండ్రులు బెంగళూరుకు వచ్చి నల్లూరహళ్లిలో నివాసం ఉంటున్నారు.

ఇంజినీరింగ్ పూర్తి చేసిన పెద్ద కుమార్తె శ్వేతకు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో రెండేళ్ల క్రితం ఉద్యోగం వచ్చింది. అక్కడే ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటానని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే పిలిచినప్పుడు ఇంటికి రాకపోవడం, ఫ్లాట్ ఎక్కడ ఉందో చెప్పకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా.. ఆమె ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెన్నెత్ అనే యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది.

ప్రేమ వ్యవహారం ఒక్కటే కాదు.. శ్వేత దాదాపు రూ.30 లక్షల వరకు అప్పులు కూడా చేసింది. అనైతిక సహజీవనం గురించి తల్లిదండ్రులు తరచూ ప్రశ్నించడంతో కుటుంబంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే తను కెనెత్‌తోనే ఉంటానని, ఆయనతోనే వివాహం చేయాలని తల్లిదండ్రులతో శ్వేత గొడవపడింది. అంతేకాకుండా కెనెత్‌కు వ్యాపారంలో రూ.30 లక్షల నష్టం వచ్చిందని, అప్పు తీర్చేందుకు తనకు ఆస్తిలో భాగం ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో సీగేహళ్లిలోని సాయిగ్రీన్‌ అపార్ట్‌మెంట్‌లో శ్వేత ఉంటుందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సోమసుందర్‌(55), ముత్తులక్ష్మి(48).. డిగ్రీ చదువుతున్న చిన్నకుమార్తె సుప్రియ(20)తో కలిసి అక్కడికి వెళ్లారు. తమతో రావాలని పెద్దకుమార్తె శ్వేతను వారు బతిమిలాడుకున్నారు.

వారి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆవేశంతో ప్రియుడు కెనెత్ తో కలిసి శ్వేతలు ఆ ముగ్గురిపై కత్తితో తీవ్రంగా దాడి చేసి,అక్కడ నుంచి వారిద్దరూ పరారయ్యారు. ముత్తులక్ష్మి, సుప్రియ అక్కడికక్కడే మరణించగా..తీవ్రంగా గాయపడిన సోమసుందర్ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు వచ్చి సహాయం కోరగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణానికి ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. హత్య అనంతరం శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పరారీలో ఉన్న శ్వేత, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.