భర్త 40.. భార్య 19: వివాహ బంధాన్ని తిరస్కరించిన యువతి.. హైకోర్టు సంచలన తీర్పు

భర్త 40 ఏళ్లు, తాను 19 అని చెబుతూ వైవాహిక జీవితం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన యువతికి మధ్యప్రదేశ్ హైకోర్టు మద్దతు తెలిపింది. ప్రేమికుడితో జీవించేందుకు అనుమతిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను బలపరిచింది. ఇద్దరు శౌర్యదీదీలను ఆ యువతికి మార్గదర్శకులుగా నియమించింది.

భర్త 40.. భార్య 19: వివాహ బంధాన్ని తిరస్కరించిన యువతి.. హైకోర్టు సంచలన తీర్పు యువతి ఎంపికకు మద్దతు – వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చిన మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్

“My Husband is 40, I am 19”: MP High Court Backs Woman’s Right to Choose Partner

ప్రేమకే ఓటు… చట్టం మద్దతు

19 ఏళ్ల యువతి 40 ఏళ్ల భర్తతో కలిసుండటానికి నిరాకరిస్తూ,  ప్రేమికుడితో జీవించేందుకు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆమె స్వేచ్ఛను గౌరవిస్తూ అనుమతిచ్చింది. ‘శౌర్య దీది’ల ద్వారా 6 నెలల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేసింది.

 

(విధాత – ఆఫ్​బీట్​) :  హైదరాబాద్

మధ్యప్రదేశ్​ ఉన్నత న్యాయస్థానంలో ఒక అద్భుతమైన, ఆలోచింపజేసే సన్నివేశం ఆవిష్కృతమైంది. ఒక వైపు భర్త, మరో వైపు ప్రేమికుడు, మధ్యలో తల్లిదండ్రులు… అందరి చూపులు ఒకే వ్యక్తిపై నిలిచాయి — 19 ఏళ్ల యువతి. ఆమె ఒక్క మాటతోనే తన జీవితానికి దిశను నిర్ణయించుకుంది. ఆయనకు 40 ఏళ్లు, నాకు 19. భార్యాభర్తలుగా ఎలా కలిసుండమంటారు? నేను మేజర్​ను… నా ఇష్టానుసారం జీవించే హక్కు నాకుంది. 40 ఏళ్ల భర్తతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఉండనంటూ ఆమె కుండ బద్దలు కొట్టింది. న్యాయస్థానం తన అభిప్రాయానికే మద్దతు తెలిపింది.

ఇష్టమే ముఖ్యమన్న ఉన్నత న్యాయస్థానం

తన భార్యను మరో వ్యక్తి అక్రమంగా నిర్బంధించాడని ఆరోపిస్తూ, అవదేశ్​ అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌ హైకోర్టు గ్వాలియర్‌ బెంచ్ ముందు కేసు హెబియస్ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేసాడు. పోలీసుల ద్వారా యువతిని గుర్తించి కోర్టు ముందు హాజరుపరిచారు.

కానీ విచారణలో కీలక మలుపు తిరిగింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు యువతి స్పష్టంగా, భయం లేకుండా సమాధానాలు ఇచ్చింది. తనను ఎవరూ నిర్బంధించలేదని, స్వచ్ఛందంగా తనకు నచ్చిన అనుజ్​ అనే వ్యక్తితో జీవిస్తున్నానని తెలిపింది. ఈ నేపథ్యంలో, యుక్తవయస్కురాలైన యువతికి తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది కాబట్టి, తన స్వేచ్ఛను కాపాడటం చట్టం బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది.

వయసు తేడా మరిచి చేసిన సంబంధం : కలవని మనసులతో కుదరని అనుబంధం

తన వైవాహిక జీవితం గురించి చెబుతూ, ఆ తనకి 19 ఏళ్లనీ, భర్త 40 ఏళ్ల వాడనీ, 21 ఏళ్ల వయసు తేడా కారణంగా తమ మధ్య సఖ్యత కుదరలేదని వివరించింది. తమ వివాహంలో బంధం  కంటే విభేదాలే ఎక్కువగా ఉన్నాయని, తనకు అన్యాయం జరిగిందని  కన్నీళ్లతో వాపోయినప్పుడు న్యాయస్థానంలో భావోద్వేగాలు ముప్పిరిగొన్నాయి.

కోర్టు సూచనతో ప్రభుత్వ న్యాయవాది అంజలీ జ్ఞానాని కౌన్సెలింగ్ నిర్వహించినా, ఆమె నిర్ణయంలో మార్పు రాలేదు. ప్రియుడు అనుజ్​తోనే జీవించాలనే తన అభిప్రాయాన్ని మళ్లీ మళ్లీ స్పష్టం చేసింది. ఈ సమయంలో ప్రియుడు కూడా కోర్టు ముందు హాజరై, ఆ యువతంటే తనకు చాలా ఇష్టమంటూ, ఆమెను జీవితాంతం చాలా బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ దశలో కేసు ఒక కుటుంబ వివాద పరిధి  దాటి వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చగా మారింది.

‘శౌర్య దీది’ల పర్యవేక్షణలో ఆరు నెలలు : కోర్టు మానవత్వం

యువతి నిర్ణయాన్ని గౌరవించిన హైకోర్టు, ఆమెను ప్రేమికుడితో వెళ్లేందుకు అనుమతించింది. న్యాయమూర్తులు జస్టిస్​ ఆనంద్​ పాఠక్​, జస్టిస్​ పుష్పేంద్ర యాదవ్​ ఇక్కడితో ఆగలేదు. ఆమె భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.

ఇద్దరు మహిళా అధికారులను “శౌర్య దీది”లుగా ఆరు నెలలపాటు పర్యవేక్షణకు నియమించింది. వారు యువతితో నిరంతరం సంప్రదింపులో ఉండి, ఆమె సంక్షేమం, భద్రతను పర్యవేక్షిస్తారు. అవసరమైతే మార్గదర్శనం కూడా చేస్తారు.

“శౌర్య దీది”లంటే.?

“శౌర్య దీది” అనే పద్ధతిలో  మహిళా పోలీస్ అధికారులు లేదా సామాజిక సేవకులు బాధితులకు మార్గదర్శకులుగా ఉంటారు. వారు కేవలం రక్షణ మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని సరిదిద్దుకునేందుకు సహాయం చేస్తారు. బాధితులు లేదా సున్నిత స్థితిలో ఉన్న పిల్లలు, యువతులు మళ్లీ సమాజంలో స్థిరపడేందుకు సహాయం దారి చూపడం దీని ప్రధాన లక్ష్యం.ఈ శౌర్యదీదీ అనే భావన న్యాయమూర్తి ఆనంద్​ పాఠక్​ మేధోపుత్రిక. గతంలో ఒక కేసు విషయంలో ఆయనే ఈ పద్ధతిని ప్రతిపాదించారు.

యువతి మంచిచెడ్డలు ఇక కోర్టు పరిశీలనలో..

కోర్టు ఆదేశాల ప్రకారం, ఆరు నెలల పాటు ఈ కేసుకు సంబంధించిన ప్రభుత్వ న్యాయవాది అంజలి, కానిస్టేబుల్​ భావన శౌర్యదీదీలుగా యువతితో నిరంతరం సంప్రదింపులో ఉండి, ఆమె సంక్షేమం, భద్రత, భవిష్యత్తును పర్యవేక్షిస్తారు. అవసరమైతే విద్య, ఉపాధి వంటి అంశాల్లో కూడా మార్గదర్శనం అందిస్తారు.

ఈ తీర్పు కేవలం ఒక కేసు పరిష్కారం కాదు… వ్యక్తిగత స్వేచ్ఛకు చట్టం ఇచ్చిన శక్తివంతమైన సందేశం. కుటుంబం, సమాజం, వివాహం అనేవి ప్రతీవారి వ్యక్తిగత ఇష్టానుసారమే ఉండాంటూ, మేజర్​ అయిన వ్యక్తి జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు వారిదే అని మరోసారి స్పష్టం చేసింది.