- తానే సీనియర్ అంటున్న రమేశ్ చెన్నితల
- గెలిపించింది తానేన్న కేసీ వేణుగోపాల్
కేరళలో ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో పార్టీ నేతల మధ్య వివాదం తీవ్రమవుతున్నది. కేరళ సీఎం పదవి తనకే దక్కాలని యూడీఎఫ్ చైర్మన్ వీడీ సతీశన్ పట్టుబడుతున్నారు. తనకు ఇస్తే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, లేదంటే తనకు ఏ పదవీ వద్దని హైకమాండ్ పంపిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లకు సతీశన్ తేల్చి చెప్పారని వార్తలు వస్తున్నాయి. తాను ఎలాంటి రాజీ ఫార్ములాకు కూడా అంగీకరించేది లేదని స్పష్టం చేశారని ఆ వార్తల సారాంశం. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్ శిబిరం.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిలో తమకు 63 మంది మద్దతు ఉందని చెబుతోంది. మరోవైపు సతీశన్ వర్గం సుమారు 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతోంది. ఇక పార్టీ సీనియర్ నేత కేరళ అసెంబ్లీ మాజీ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల సైతం బరిలో నిలిచారు. తనకు 23 మంది ఎమ్మె్ల్యేల మద్దతుతోపాటు.. పార్టీలో సీనియర్ నాయకుడినని చెబుతున్నారు.
తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో ఏ మంత్రి పదవీని కూడా చేపట్టేది లేదని, ఎమ్మెల్యేగానే కొనసాగాలని కఠిన వైఖరిని సతీశన్ తీసుకున్నారని తెలుస్తున్నది. ఇటీవలి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ సారథిగా సతీశన్.. పార్టీని విజయతీరాలకు చేర్చారు. అంతకు ముందు పార్టీ నేత కే సుధాకరన్ ప్రతిపాదించిన.. ప్రస్తుతం పార్టీ అధినాయకత్వం పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్న రాజీ ఫార్ములను సైతం సతీశన్ తిరస్కరించారు. ఈ ఫార్ములా ప్రకారం.. కేసీ వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిని చేయడం, క్యాబినెట్‌లో కీలక పదవులను వీడీ సతీశన్, రమేశ్ చెన్నితలకు అప్పగించడం. అయితే.. ఇటువంటి రాజీ ఫార్ములాలను తాను అంగీకరించబోనని సతీశన్ కుండబద్దలు కొడుతున్నారు.
సతీశన్ వాదనకు యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలు ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్, ఆరెస్పీ మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. రాష్ట్ర పార్టీపై గట్టి పట్టున్న నేతగా చెప్పే వేణుగోపాల్ శిబిరం.. భాగస్వామ్య పక్షాలో, లేదా బయటి నుంచి వచ్చినవారో సీఎం అభ్యర్థిని నిర్ణయించడం కాదని, అది కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలకు వదిలిపెట్టాలని వాదిస్తున్నది. తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి.. భాగస్వామ్య పక్షాలను ‘టీమ్ యూడీఎఫ్’గా కలిపి.. విజయం దిశగా నడిపించిందే సతీశన్ అని ఆయన శిబిరం వాదిస్తున్నది. బలమైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని చెబుతున్నది. ప్రజలు, భాగస్వామ్యపక్షాల ఆకాంక్షను అధినాయకత్వం విస్మరించజాలదని అంటున్నది. భాగస్వామ్య పక్షాల మద్దతు లేని నాయకుడు సంకర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించలేడనేది సతీశన్ వర్గాల వాదన.
ఈ వాదనను కేసీ వేణుగోపాల్ శిబిరం కొట్టిపారేస్తున్నది. సతీశన్‌కు ప్రజల్లో పెద్ద మద్దతు ఏమీ లేదని, అంతా సోషల్ మీడియాలోనే ఆ వర్గం ఆయనను ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్నదని తేల్చేస్తున్నది. ఏది ఏమైనా మూడు శిబిరాలు.. ఫ్లెక్సీలతో, తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత తనకు వచ్చిన మద్దతును పార్టీ అధినాయకత్వం విస్మరించదనే భావనతో సతీశన్ ఉన్నట్టు చెబుతున్నారు. సతీశన్‌కు మద్దతుగా పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తులు చేయాలని పౌర సంఘాలు, సాధారణ ప్రజలు, పార్టీ అనుబంధ సంఘాలను కోరుతుండటం విశేషం.
ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. కేసీ వేణుగోపాల్‌ను సీఎం చేస్తే.. రెండు ఎన్నికలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎందుకంటే వేణుగోపాల్ ప్రస్తుతం అలప్పుళ ఎంపీగా ఉన్నారు. దానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో ఏదో ఒక స్థానం నుంచి పోటీచేసి గెలవాల్సి ఉంది. వాస్తవానికి ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని సతీశన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపడమే కాకుండా.. అనవసరంగా ఉప ఎన్నికలను రుద్దినట్టు అవుతుందని అంటున్నారు. ఒకవేళ కేసీ వేణుగోపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినట్టయితే తాను తాను ప్రచార బాధ్యతల నుంచి తప్పుకొంటానని, వేణుగోపాల్ లేదా వేరే ఎంపీకి ఆ బాధ్యతలు అప్పగించుకోవచ్చని అభ్యర్థుల ఎంపిక సమయంలోనే సతీశన్ తేల్చి చెప్పారని సమాచారం. ఈ ఒత్తిడితోనే పార్టీ అధిష్ఠానం ఎంపీలెవరినీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపలేదని తెలుస్తున్నది. ఇప్పుడు అదే అంశాన్ని సతీశన్ ముందుకు తెస్తున్నారు. మొత్తానికి ఈ సమస్యను అధిష్ఠానం ఎలా తెగ్గొడుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.