- రైతు సమస్యలకు మోదీయే ముఖ్య కారణం
- రైతుల గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలి
- రైతుల సమస్యల పై ఓట్లు దండుకునే కుట్ర
- అధికారంలో ఉండగా అన్నీ మింగేశారు
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆగ్రహం
విధాత, ప్రత్యేక ప్రతినిధి: అకాల వర్షాలను అడ్డుపెట్టుకుని రైతుల సమస్యలతో ఓట్లుదండుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ నేతలు బట్టేబాజ్ గాళ్ళని, రైతుల సమస్యలకు ప్రధాన కారణం మోదీ అనుసరిస్తున్న విధానాలు కారణమంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అన్ని పథకాల్లో తినేసి, మింగేసి, పదవులు కోల్పోయి… ప్రజలు బొందపెడితే ఇప్పుడు తిరిగి రైతుల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ లో రైతు మేళా ముగింపు సమావేశానికి గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, బీజేపీ నాయకుల పై తన సహజశైలికి భిన్నంగా నిప్పులు చెరిగారు.
ఓరుగల్లుకు ప్రాశస్త్యం, చరిత్ర ఉన్న, పౌరుషానికి ప్రతీకైన కాకతీయ ఓరుగల్లు గడ్డ మీదికి పనికిమాలినోళ్ళు వచ్చి, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ… రైతాంగాన్ని అవమానపరుస్తున్నారని బీఆర్ఎస్ నాయకులనుద్ధేశించి మంత్రి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ , కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు రాహుల్ పై కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే సిగ్గేస్తోందన్నారు. పదేళ్ళు బీఆర్ఎస్ నాయకులు చేయలేని అన్ని పనులను, రెండు సంవత్సరాలలో ధీరోదాత్తంగా సీఎం రేవంత్ చేశారన్నారు. రూ. 21వేల కోట్లు, 25 లక్షల కుటుంబాలకు రెండు లక్షల రుణమాఫీ చేశారన్నారు. బీఆర్ఎస్ సర్కారు పది సంవత్సరాలు లక్ష రూపాయల రుణ మాఫీ చేయలేక రైతుల పై రూ. 12వేల కోట్ల వడ్డీ భారాన్ని మోపారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులను రైతులు చీదరించుకుని, చీకొట్టి, బొందపెడితే … ఇప్పుడు రైతుల కష్టాలను ఓట్లుగా మార్చుకుని మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న నీచపు ఎత్తుగడ అంటూ విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలే బట్టేబాజ్ గాళ్ళు
రుణమాఫీలో మీరే బట్టేబాజ్ గాళ్ళు..సిగ్గులేకుండా రుణమాఫీ పై మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతల పై మంత్రి తుమ్మల ఫైరయ్యారు. రైతు బంధు పేరుతో అన్ని పథకాలు ఆపేసి , రైతులను అష్టకష్టాలపాలు జేశారన్నారు. ప్రతీ సారి ఎన్నికల ముందు రైతు బందు డబ్బులు వేసి ఓట్లేపించుకున్నారని విమర్శించారు. పదేండ్లలో బీఆర్ఎస్ రూ. 69వేల కోట్లు రైతులకు ఇస్తే , కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళలో రూ. 30వేల కోట్లు వేశామన్నారు. ఈ బీఆర్ఎస్ దరిద్రులకు బుర్రుండాలి… యుద్ధాలు జరుగుతుంటే యూరియా ఎలా వస్తుంది? మీరిచ్చినట్లు 6, 7 మెట్రిక్ టన్నుల యూరియా కాకుండా మేము 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చి రైతులకు అందించామన్నారు.
బీఆర్ఎస్ కాలంలో చనిపోయిన రైతుల ఆత్మహత్యలు మరిచిపోయి, సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 40, 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుందన్నారు. దేశంలో రైతుల మీద రూ. లక్ష కోట్లు ఖర్చుచేసిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదన్నారు. అకాల వర్షాలను అడ్డుపెట్టుకుని, రైతుల ఇబ్బందులను ఉపయోగించుకుని రాజకీయం చేస్తున్నారని, మిమ్మల్ని రైతులు ఎప్పుడో బొందపెట్టారన్నారు. మీ హయంలో చేసిన అవినీతిని, మీ చేష్టలను ఏ రైతు మరిచిపోరన్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మీ బాడీ లాంగ్వేజీ, మీ భాషను అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
దేశంలో మొక్కజొన్నలు కొనుగోలు చేసే ఎకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మీరు అధికారంలో ఉన్నప్పుడు రూ. 10వేల కోట్లు తినేస్తే… మేం మళ్ళీ అప్పు తెచ్చి మక్కలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ధాన్యం, మక్కలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామన్నారు.. అప్పులు తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం మొన్ననే చెప్పిందన్నారు. మీ బతుక్కి అర్ధం చేసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పంట ఉత్పత్తిలో, కొనుగోలులో, యూరియా వినియోగంలో తెలంగాణ తొలిస్థానమన్నారు. ఎన్ని కష్టాలున్నా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
అమెరికా దిగుమతులకు మోదీ అండ
సకాలంలో రైతులకు డీజిల్, యూరియా అందకపోవడానికి కారణమైన కేంద్రంలోని బీజేపీ కూడా బీఆర్ఎస్ జతకట్టి మనల్ని విమర్శిస్తుందని తుమ్మల మండిపడ్డారు. పశ్చిమ బంగా రాష్ట్రం నుంచి రావాల్సిన గన్నీ బ్యాగులు ఎన్నికల వల్ల జాప్యమయ్యాయని వివరించారు. కాంటా వేసే కార్మికులు కూడా అక్కడివాళ్లే కావడంతో ఎన్నికల కోసం వెళ్ళారని చెప్పారు. యుద్ధం వల్ల డీజిల్ కొరతతో రవాణా వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందులపాలవుతున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 15లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పండించారని, ఇక్కడి రైతుల నుంచి మక్కలు కొనకుండా జాప్యం చేస్తూ మోదీ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారంటూ … అమెరికా మొక్కజొన్నలే కావాలా? మోదీకి? అంటూ నిలదీశారు.
దేశ వ్యాప్తంగా రైతులు పత్తి పండిస్తుంటే తక్కువ ధరకు వస్తుందంటూ దిగుమతి సుంకం తగ్గించి అమెరికా నుంచి 40లక్షల క్వింటాళ్ళ పత్తి దిగుమతి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పామాయిల్ దిగుమతి సుంకం తగ్గించి మరీ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ రైతులు పండించిన పత్తి, మొక్కజొన్న, పామాయిల్ పంటలకు సరైన ధరరాక ఇబ్బంది ఏర్పడుతుందని మంత్రి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేఖ, ఎంపి కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, శ్రీహరి, నాగరాజ్, సత్యనారాయణరావు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన రైతు మేళాలో పంటల ఉత్పత్తులు, పండ్లు, ఆధునిక యంత్రాల ప్రదర్శన ఆకట్టుకున్నది.
