విధాత : దూకుడు రాజకీయాలకు పేరొందిన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగ సభలు..మీడియా సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరుస్తున్నాయి. ప్రతిపక్షాలపై విమర్శల దాడి చేసే క్రమంలో..తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి ఒక్కోసారి తన మాటల డోస్ పెంచేసినట్లుగా కనిపిస్తున్నప్పటికి..ఇంకోవైపు మాజీ సీఎం కేసీఆర్ ను తలపిస్తున్నారన్న విమర్శలకు సైతం ఆస్కారం ఇస్తున్నాయి. స్వతహాగా ఫుట్ బాల్ క్రీడాభిమానియైన రేవంత్ రెడ్డి ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదంతో సెల్ప్ గోల్ చేసుకునే రీతిలో మాట్లాడం కాంగ్రెస్ వర్గాలలో సైతం అంతర్మథనాన్ని రేపింది. ఇది ఇలా ఉండగానే..హిట్లర్ ని స్ఫూర్తిగా తీసుకొని హైడ్రా తీసుకొచ్చామంటూ ‘ది హిందూ’ పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో రాజకీయ రచ్చ రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిట్లర్ మాటలు…ఆయనతో పాటు కాంగ్రెస్ కు సైతం ఇరకాటంగా మారాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో కొనసాగుతుంది.
రేవంత్ మాటలు..మరో సెల్ఫ్ గోల్ అవుతుందా..?
ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన కోర్ టీమ్ పేరు మీదుగానే హైడ్రా ఏర్పాటుచేశానని రేవంత్‌రెడ్డి బహిరంగంగా చెప్పడం ప్రతిపక్షాలకు, హైడ్రా వ్యతిరేకులకు ఆయుధంగా మారింది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో తాను హైడ్రాను తీసుకొచ్చానని, ‘హైడ్రా అనేది హిట్లర్ ఫేవరేట్ పదం. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని అర్థం. హిట్లర్‌కు ఉన్న కోర్ టీమ్ పేరు హైడ్రా. ఆ టీమ్ ఎవరినైనా అంతం చేయగలదు. అందుకే నేను హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొని ఈ వ్యవస్థకు హైడ్రా అని పేరు పెట్టానంటూ గొప్పగా సెలవిచ్చారు. ఆక్రమణల విషయంలో ఒత్తిళ్లకు లొంగకుండా హైడ్రా నిర్దేశించుకున్న పని పూర్తి చేస్తుందని చెప్పే క్రమంలో రేవంత్ రెడ్డి తను తీసుకొచ్చిన హైడ్రాకు హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇదే రేవంత్ రెడ్డి గతంలో హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వచ్చినప్పుడు.. ‘భగవద్గీత స్ఫూర్తితోనే హైడ్రాను తీసుకొచ్చాం, దుష్టశిక్షణ-శిష్టరక్షణే మా లక్ష్యం’ అని చెప్పడాన్ని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు ‘హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా పేరు పెట్టాం’ అని రేవంత్ చెప్పాడని..అసలు హైడ్రాకు స్ఫూర్తి భగవద్గీతా? లేక హిట్లరా? అన్న విషయంలో ఆయనకే క్లారిటీ లేదంటూ చురకలంటిస్తున్నారు.
ప్రజాపాలన ముసుగు తొలగిపోయిందా…!
ఇప్పటికే హైడ్రా ఏర్పాటు..దాని పనితీరుపై హైదరాబాద్ వాసుల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా హైడ్రా చేస్తున్న కూల్చివేతల పర్వం పట్ల మధ్యతరగతి, పేద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆక్రమణలపై హైడ్రా చర్యలు పేదోళ్లకే తప్ప పెద్దోళ్లకు కాదన్న చర్చ ఆది నుంచి వినిపిస్తునే ఉంది. ఇందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఆక్రమణల జోలికి హైడ్రా వెళ్లకపోవడమే నిదర్శనమన్న వాదన కొసాగుతుంది. పొంగులేటి, ఒవైసీ, సీఎం కుటుంబ సభ్యులు, బడా బిల్డర్ల ఆక్రమణలపై హైడ్రా స్పందించకపోవడాన్ని హైడ్రా వ్యతిరేకులు ఎత్తిచూపుతుంటారు. తాజాగా టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత మూసీ బఫర్ జోన్ లో ఆధిత్య బిల్డర్స్ నిర్మాణాలపై చర్యలు ఎందుకు లేవంటూ ప్రశ్నించడం తెలిసిందే.
నయా హిట్లర్ రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్
హైడ్రా పనితీరుపై భిన్నాభిప్రాయల పర్వం కొనసాగుతుండగానే.. నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా తీసుకొచ్చామంటూ రేవంత్‌రెడ్డి బహిరంగంగా అంగీకరించడం అనేక విమర్శలకు దారితీస్తుండటంతో కాంగ్రెస్ ఢిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేవంత్ మాటల ప్రభావం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తుంది. రేవంత్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సహజంగానే ఎదురుదాడి ఉదృతం చేసింది. లక్షల మందిని బలి తీసుకున్న అడాల్ఫ్ హిట్లర్‌కు వారసుడిలా…లక్షలాది పేదల గూళ్లు కూల్చి వారి బతుకులను రోడ్డున పడేస్తున్న నయా హిట్లర్ అనుముల రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముప్పేట దాడి సాగిస్తుంది. కూల్చివేతలతో నిరాశ్రయులైన ఆ పేదల కన్నీళ్లు నిన్ను క్షమించవు..నిరాశ్రయులైన పేదల శాపాలు నిన్ను వెంటాడుతాయి..నువ్వు కూడా చరిత్రలో నియంత హిట్లర్ మాదిరిగానే అత్యంత దుర్మార్గ పాలకుడిగా మిగిలిపోవడం ఖాయం అంటూ విమర్శలు గుప్పించింది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా హిట్లర్ స్ఫూర్తిని చాటుకోవడంతో..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ముసుగు తొలగిపోయిందని బీఆర్ఎస్ ఫైర్ అయ్యింది.
ఎమర్జన్సీ ధోరణి బహిర్గతమైంది : కిషన్ రెడ్డి
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన ‘హిట్లర్’, ‘అత్యవసర పరిస్థితి’ (ఎమర్జెన్సీ) తరహా కాంగ్రెస్ ధోరణి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమైందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. హైడ్రా ఏర్పాటుకు హిట్లర్ తనకు స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి బహిరంగంగానే గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో చేపట్టిన కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్ వంటి యుద్ధగ్రస్త దేశాల్లోని పరిస్థితులతో పోల్చుతూ, తన నాయకుడు రాహుల్ గాంధీ భాషనే అనుసరిస్తున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఎమర్జెన్సీ కాలం నుండి హిట్లర్ తరహా ధోరణి వరకు… కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నమే చేస్తూ వచ్చిందని విమర్శించారు. హిట్లర్ స్ఫూర్తి వ్యాఖ్యల పట్ల రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్ అహంభావం..రేవంత్ రెడ్డిని అవహించిందా..!
సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు వ్యాఖ్యలు..మోదీతో కొట్లాట వ్యాఖ్యలు గతంలో కేసీఆర్ అనుసరించిన రాజకీయ విధానాలను తలపిస్తున్నాయన్న చర్చను రాజేసింది. కేసీఆర్ తన ప్రభుత్వంలో ధరణి పోర్టల్,డబుల్ బెడ్రూమ్ పథకం, గురుకులాలు, కాళేశ్వరం నిర్మాణాలపై ఎంత మొండిగా వ్యవహరించేవారో..ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణలపై అంతే మొండిగా ముందుకెలుతున్నారని..సీఎంగా కేసీఆర్ ప్రదర్శించిన అహంభావం..నియంత వైఖరిని..ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీనా..బోడినా అంటూ కేసీఆర్ తను అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి…టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తాం..మోదీని దించేస్తాం..రాష్ట్రంలో మళ్లీ మేమే వస్తాం అంటూ తనే ఫామ్ హౌస్ స్థాయికి పడిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లోనైతే బీఆర్ఎస్ ను సున్నా స్థానాలకు దిగజార్చారు. తనను అందలం ఎక్కించిన తెలంగాణ సెంటిమెంట్ ను నిర్లక్ష్యం చేసి ఆపద కాలం నినాదంగా మార్చేశారు.
రేవంత్ రెడ్డిలోనూ అహంకారపు వైరస్ ?
అధికారంలో ఉన్న కాలంలో కేసీఆర్ ను ఆవహించిన అధికార అహంకారం అనే వైరస్ ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డికి కూడా సోకిందన్నట్లుగా కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం కేంద్రంతో ఘర్షణా వైఖరికి దిగడం చూస్తే నాడు కేసీఆర్ బాటలోనే ఆయన కూడా సాగిపోతున్నట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోదీపై ఘాటైన విమర్శలు చేయడం..కేంద్ర మంత్రులను, ఎంపీలను పొలిమేర దాటనివ్వబోమని..కేంద్రంలో రాహుల్ ను ప్రధాని చేస్తా…రాష్ట్రంలో 2034వరకు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి పేలుస్తున్న డైలాగ్ లు..గతంలో కేసీఆర్ అనుసరించిన కేంద్రంతో ఘర్షణాత్మక పోకడలను తలపిస్తున్నాయంటున్నారు. నాడు కేసీఆర్ తీరు..నేడు రేవంత్ వైఖరి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా..రాష్ట్రానికి నష్టదాయకంగా ఉన్నాయని ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితో నాడు కేసీఆర్, నేడు రేవంత్ హయాంలో కేంద్రం నుంచి తెలంగాణ సరైన సహకారం పొందలేకపోతుందని..ఇదే సమయంలో ఏపీ మాత్రం వైసీపీ, టీడీపీ హాయాంలో కేంద్ర సహకారంతో ముందుకెలుతుందని గుర్తు చేస్తున్నారు.
కేంద్రం సహకారం తెలంగాణకు మరింత దూరం
ఇప్పటికే దేశంలో తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కు రేవంత్ పాలనలో తెలంగాణ ఏటీఎంగా మారిపోయి..ఎన్నికలలో ఆర్థిక ఇంధనంగా మారిందన్న భావన బీజేపీలో ఉంది. పదేపదే ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన మాటలు మాట్లాడటం, రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ అని చెప్పడం, డీలిమిటేషన్ ను వ్యతిరేకించడం వంటి వాటిలో రేవంత్ వ్యహరశైలీ బీజేపీలో అసహనం రేపింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రంతో యుద్దానికి సై అంటూ రెచ్చిపోతుండటం..రాష్ట్ర ప్రగతికి అవరోధంగా మారవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు సమస్య, ఆర్ఆర్ఆర్ కు నిధులు, తుమ్మడిహట్టి సమస్య, మెట్రో విస్తరణ అనుమతి, వరంగల్, అదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణాలు, పాలమూరు- రంగారెడ్డి జాతీయ హోదా, డ్రై పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులన్ని కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయంటునే రేవంత్ రెడ్డి కేంద్రంపై విమర్శలు చేస్తుండటం కార్యసాధనకు కావాల్సిన రాజనీతి కాదన్న వాదన వినిపిస్తుంది.