Telangana IAS officers | వారికి ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే. ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనే తేడా లేదు. వారి అధికార పీఠాలకు ఢోకా లేదు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక వెలుగు వెలిగిన అధికారులు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తమ ఆధిపత్యాన్ని, హవాను నడిపిస్తున్నారని సచివాలయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాదిన్నర అవుతున్నా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులను కీలక శాఖల నుంచి తప్పించే సాహసం రేవంత్ రెడ్డి సర్కారు చేయడం లేదని అంటున్నారు. వారిని తప్పించని ఫలితంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు చేరిపోతున్నాయనే ప్రచారం కొన్ని నెలలుగా బలంగా వినిపిస్తున్నది. అయినా.. ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అంటున్నారు.
బీఆర్ఎస్ పాలనలో చక్రం తిప్పారు… ఇక్కడ తిప్పుతున్నారు
గత ప్రభుత్వంలో చక్రం తిప్పారని ప్రచారం జరిగినవారిలో ఇద్దరు అధికారులను మాత్రమే కొత్త ప్రభుత్వం బదిలీ చేసింది. వారిలో ఒకరు సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్ కాగా, మరొకరు నవీన్ మిట్టల్. వీరిద్దరు మినహా ఏ ఒక్క అధికారిని కూడా బదిలీ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం వెనుక కారణాలేంటన్న చర్చ సచివాలయ కారిడార్లలో బాహాటంగానే వినిపిస్తున్నది. ఫార్ములా ఈ రేసు కేసును బూచిగా చూపించి మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను అక్కడి నుంచి తప్పించి.. విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేసింది. ఆయనపై ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ నిర్వహిస్తున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఫార్ములా ఈ రేసు పై ఈసీఐఆర్ నమోదు చేయగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కే తారక రామారావు ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ రాగానే మున్సిపల్ వ్యవహారాల శాఖకు నియమితులైన ఎం దాన కిశోర్ చేత ఫార్ములా ఈ రేసు కేసుపై ఏసీబీ విచారణకు ఫిర్యాదు చేయించి, తమ పని తీరడంతో ఆయనను అక్కడి నుంచి తప్పించి కార్మిక శాఖకు బదిలీ చేశారని సచివాలయంలో ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను బదిలీ చేస్తారని తెలంగాణ సమాజం భావించింది. అయితే ఆయనపై ఈగ వాలనీయకుండా ఏడాదిన్నర పాటు రెండు పదవుల్లో కొనసాగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం ఖాతరు చేయలేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చారనే ఆరోపణలు నవీన్ మిట్టల్‌పై వచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా మొన్నటి వరకు కొనసాగించిందని అంటున్నారు. ఏమైందో ఏమో కానీ తాజాగా జరిపిన బదిలీల్లో నవీన్ మిట్టల్‌ను రెవెన్యూ శాఖ నుంచి బదిలీ చేసి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. అప్రాధాన్య పోస్టులో నియమిస్తారని ఊహించిన తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వీరిలో ఒకరిని తప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిసిన ఏ ఒక్క అధికారినీ కీలక పదవుల నుంచి తప్పించలేదని సచివాలయ వర్గాలు అంటున్నాయి.
గత ప్రభుత్వంలో టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంవత్సరాల పాటు హవా చెలాయించిన ఈ వెంకటనరసింహా రెడ్డిని బదిలీ చేసి, తొలుత కీలకమైన విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఆ తరువాత అక్కడి నుంచి తప్పించి పరిశ్రమలు, పెట్టుబడుల సీఈవో, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో చాలా సన్నిహింతగా మెలిగిన విషయం అందరికీ తెలిసిందే. టీజీఐఐసీ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలకు భూములు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఒక పద్దతి లేకుండా తమకు నచ్చిన వారికి తక్కువ రేటు, నచ్చనివారు అయితే అధిక ధరకు భూములను కేటాయించారనే విమర్శలూ వచ్చాయి. బషీర్ బాగ్ పరిశ్రమ భవన్‌లో ఉన్న టీజీఐఐసీ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా నరసింహారెడ్డి ఉండేవారు కాదని, ఎవరైనా ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు గట్టిగా అడిగితే మంత్రి కేటీఆర్ లేదా జయేశ్ రంజన్ వెంట ఉన్నారని పేషీ సిబ్బంది చెప్పేవారని పలువురు గుర్తు చేస్తున్నారు. దీంతో వారు ఏం మాట్లాడకుండా మిన్నకుండి వెళ్లిపోయేవారని అంటున్నారు. ప్రస్తుత మెట్రో వాటర్ సప్లయి అండ్ సివరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి మంత్రి టీ హరీశ్ రావుకు ఓఎస్డీగా పనిచేశారు. ఆయన వద్ద పనిచేస్తుండగానే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆ తరువాత ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల పాటు ఉద్యానవన శాఖలో పనిచేసి, శిక్షణపై వెళ్లివచ్చిన తరువాత హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయి అండ్ సివరేజి బోర్డు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో హరీశ్ రావుకు సన్నిహితంగా ఉంటూ పనిచేసిన ఆయనకు నగరంలో అత్యంత కీలకమైన మెట్రో వాటర్ బోర్డు ఎండీ బాధ్యత అప్పగించడంతో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. బీఆర్ఎస్ ఏలుబడిలో పెద్ద నాయకుల వద్ద పనిచేసిన వారికి ఈ ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ అప్పట్లో విమర్శలొచ్చాయి.
మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖలో కీలకమైన మూడు పదవుల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు చక్రం తిప్పుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో మాణిక్కరాజ్ మున్సిపల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ వ్యవహారాల్లో పనిచేస్తూ, డిప్యూటేషన్ ముగియడంతో గతేడాది తెలంగాణ సర్వీసులో చేరిపోయారు. ఆ వెంటనే రేవంత్ రెడ్డి ఆయనను తన కార్యాలయంలో కార్యదర్శిగా నియమించి, మున్సిపల్ వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్న ఇలంబరితి మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి బదిలీ చేసి కొత్తగా సృష్టించిన పట్టణాభివృద్ధి శాఖలో ఆయనను నియమించారు. ఇలంబరితి స్థానంలో ఆర్వీ కర్ణన్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ సీటులో కూర్చొనబెట్టారు. అంతకు ముందు ఆయన స్టేట్ ఫుడ్ సేఫ్టీ విభాగంలో కమిషనర్‌గా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం డైరెక్టర్‌గా పనిచేసి నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. దీంతో ఆయన పేరు నగరంలో ఒక్కసారిగా తెరమీదికి వచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సిఫారసుతో జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమితులు అయ్యారనే చర్చ కార్పొరేటర్లలో వినిపిస్తున్నది. ఈ ముగ్గురు అధికారులు సచివాలయంలో సమావేశమైన సందర్భంలో ఎవరైనా అక్కడకు వెళితే అకస్మాత్తుగా వారు మాట్లాడుకునే భాష మారుతుందని పలువురు అధికారులు చెబుతున్నారు. మాట్లాడుతున్న ఆంగ్ల భాషను ఆపేసి తమిళంలోకి మారిపోతారు. దీంతో అక్కడికి వెళ్లిన అధికారికి వారు ఏం మాట్లాడుకుంటున్నదీ తెలియదు. కీలకమైన మున్సిపల్ శాఖలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిని కింది నుంచి పై స్థాయి వరకు నియమించడం సరికాదనే చర్చ సచివాలయంలో జరుగుతోంది. వీరు ముగ్గురు కూడా శంషాబాద్ లోని ఒక రెసిడెన్సియల్ లే అవుట్ లోని విల్లాల్లో నివసిస్తున్నారని సమాచారం. ఈ ముగ్గురు అధికారులు పరస్పరం చర్చించుకుని పనులు చక్కదిద్దుకుంటున్నారని బిల్డర్లు, రియల్టర్లు చర్చించుకుంటున్నారు. వారికి వ్యతిరేకంగా వెళ్లడం కంటే ఊరుకోవడం మేలనే నిర్ణయానికి తాము వచ్చామంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చని పలువురు రియల్టర్లు అంటున్నారు.
వారికి ఈ సర్కార్‌లోనూ అన్యాయమే?
బీఆర్ఎస్ హయాంలో బాధితులుగా ఉన్న ఐఏఎస్‌లకు ఈ ప్రభుత్వంలో కీలకమైన పదవులు దక్కలేదనే చర్చలు చాలా రోజుల నుంచీ వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో చక్రం తప్పిన వారికే పదవులు దక్కుతున్నాయని, మార్పు ఎక్కడ వచ్చిందని అధికారులు నలుగురు కలిసిన చోట చర్చించుకోవడం కన్పిస్తున్నది. సబ్యసాచి ఘోష్, మహేష్ దత్ ఎక్కా, జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఈ శ్రీధర్, బాలమాయదేవి, కే సురేంద్ర మోహన్, కొర్రా లక్ష్మీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలు దక్కడం లేదని అంటున్నారు. బుద్ధ ప్రకాశ్, శ్రీధర్‌కు ముఖ్య శాఖలు ఇచ్చినట్టే ఇచ్చి.. ఆ తర్వాత మార్చేశారని పలువురు సీనియర్ అధికారులు ప్రస్తావిస్తున్నారు. బాల మాయాదేవీ, కొర్రా లక్ష్మీ ఆ ప్రభుత్వంతో అన్యాయం జరగ్గా, ఈ ప్రభుత్వంలో కూడా అంతకన్నా ఎక్కువగా జరుగుతోందనే వాదనను అధికారులు వినిపిస్తున్నారు.