- ప్రధాన పోస్టులకు ఎంపికలపై అశక్తత!
- తనవారిని నియమించుకోలేక మథనం?
- శాంతికుమారి కొనసాగింపు నచ్చని రేవంత్!
- అయినా వేరే దారిలేక ఆమె కొనసాగింపు?
- బీఆరెస్ ప్రభుత్వంలోని కీలక అధికారులే
ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్టుల్లో - వారి నియామకాల వెనుక అదృశ్య శక్తి!
- అండగా రాష్ట్ర సర్కారులోని కీలక నేత
- ఆయనకు ఢిల్లీలోనూ చక్రం తిప్పే సత్తా?
- సెక్రటేరియట్ అధికారులలో విస్తృత చర్చలు
హైదరాబాద్, మే 17 (విధాత)
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన పదవుల ఎంపిక విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? తనవారిని ఆ పదవుల్లో నియమించుకోలేక అంతర్మథనం చెందుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సచివాలయ వర్గాలు. సచివాలయంలో ముఖ్య పోస్టుల్లో నియామకాల విషయంలో ఇది స్పష్టమవుతున్నదని చెబుతున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి కొనసాగింపు మొదలు.. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఎంపిక, సీఎం కార్యాలయంలో వీ శేషాద్రి, కేఎస్ శ్రీనివాస రాజు నియామకం, రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్ కొనసాగింపులో రేవంత్ రెడ్డి ప్రమేయం అంతంత మాత్రమేనంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అదృశ్య శక్తులు రేవంత్‌ను నడిపిస్తున్నాయని, అందుకే కీలకమైన పోస్టులకు అధికారుల ఎంపికలో ఆయన మాట నెగ్గడం లేదనే టాక్ సచివాలయవర్గాల్లో విస్తృతంగా నడుస్తున్నది.
అద్భుతాలు జరుగుతాయని ఊహలు
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిపాలై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే అద్భుతాలు జరుగుతాయని అందరూ ఊహించారు. అందులో సచివాలయం ఉద్యోగులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమితులైన ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారిని తొలగించకుండా కొనసాగించడం ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో సచివాలయం ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు మూడు నెలలు వేచి చూసిన తరువాత ఇక ఆమెను పంపించడం కష్టం, రిటైర్మెంట్ అయ్యే వరకు కొనసాగుతుందనే నిర్ణయానికి వచ్చారు. గత ప్రభుత్వం కాపు నాయకుల అండదండలతో కీలకమైన పదవిని దక్కించుకున్న ఆమె ఈ ప్రభుత్వంలో కూడా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న నాయకుడి ఆశీస్సులతో కొనసాగారనే చర్చలు అప్పట్లోనే వినిపించాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన రిటైర్డ్ అధికారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా చెలమణీ అవుతున్నారు. ఆయన ఆశీస్సులతో పాటు ఇక్కడి ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి సహకారంతో సునాయసంగా తన పదవీకాలం పూర్తి చేసుకున్నారని అంటున్నారు. ఈమె పనితీరు విషయంలో రేవంత్ రెడ్డి అసహనంతో ఉండేవారని, తన సమీక్షా సమావేశాల్లో కూడా పెద్దగా ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదని సీనియర్ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. ఆమె స్థానంలో రామకృష్ణారావు కూడా ఆ ఢిల్లీ పెద్ద ఆశీస్సులతోనే నియమితులయ్యారని, ఇక్కడున్న ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి కూడా తన వంతు సహకారం అందించారని వారు పేర్కొంటున్నారు.
ఢిల్లీలోని కీలక నేత అండతో శేషాద్రి!
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో కార్యాలయంలో శేషాద్రి పనిచేశారు. ముక్కుసూటి అధికారి, నిజాయితీపరుడు అనే పేరు ఉన్నప్పటికీ, సీఎంవోలో కొనసాగించే పరిస్థితి లేదంటున్నారు. నెలలకొద్దీ కాలంగా పైళ్లు మూలుగుతున్నాయని, తొందరగా వాటిని పరిష్కరించడంలో చొరవ లేదని ప్రజా ప్రతినిధులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈయన కొనసాగింపు వెనకాల పలు కథనాలు విన్పిస్తున్నాయి. ఇక మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాస రాజు ఏపీ ప్రభుత్వంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి పోస్టును ఆశించగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేయలేదని టీడీపీ ముఖ్య నాయకులు అంటున్నారు. రాజు తన పదవికి గత ఏడాది జూన్ నెలలో వీఆర్ఎస్ సమర్పించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి నెల జూలైలో తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుడిగా నియమితులయ్యారు. ఏ అదృశ్య శక్తి పనిచేసిందో తెలియదు కానీ ఈ ఏడాది మే 1 న తెలంగాణ సీఎంవో ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటికే శేషాద్రి ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, చిత్తూరు జిల్లా వాసి రాజును నియమించడం ఏంటని తెలంగాణవాదులు చర్చించుకున్నారు. జ్యూడిషియరీలో కీలక పదవిలో పనిచేసిన పెద్దాయన సిఫారసు మేరకు సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగా పోస్టు కొట్టేశారనే చర్చ సచివాలయంలో జోరుగా సాగింది.
మిట్టల్ కొనసాగింపుపై విమర్శలు
ధరణి వెబ్ పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి కల్పతరువుగా మారిందని, తెలంగాణ రైతుల పాలిట ఉరితాడుగా మారిందని ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ పెద్దలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు లక్షల ఎకరాలను పంచిపెడితే, ఆ భూములను ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం గుంజుకుని లక్షల కోట్లు వెనకేసుకుందని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూముల క్రమబద్ధీకరణ, వివాదాస్పద ప్రభుత్వ భూములు పరాధీనం, కేసీఆర్ కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, సీసీఎల్ఏ గా విధులు నిర్వహించారని కాంగ్రెస్ నాయకులే విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత నవీన్ మిట్టల్ ను తప్పించి ప్రాధాన్యం లేని శాఖకు పంపిస్తారని చాలా మంది ఊహించారు. కానీ అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. ఇప్పటికీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సీసీఎల్ఏగా ఆయనే కొనసాగుతుండటాన్ని కాంగ్రెస్ శ్రేణులు, దగాపడ్డ భూ యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేలాది ఎకరాల విలువైన భూ కుంభకోణాల వెనకాల ఈయన హస్తం ఉందని, ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నాయకులే అంతర్మథనం చెందుతున్నారని తెలిసింది. ఈయన కొనసాగింపు వెనకాల కూడా అదృశ్య శక్తి ఉందని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులతో దర్జాగా కొనసాగుతున్నాడని అంటున్నారు.
అర్వింద్‌పైనా చర్యల్లేవు!
మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌పై కఠిన చర్యలు ఉంటాయని అందరూ భ్రమపడ్డారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో విచారణ, చర్యలు అంటూ నానా హడావుడి జరిగింది. ఇప్పుడాయన విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇసుమంతైనా చర్యలు తీసుకోలేదని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఇవన్నీ గమనిస్తే ప్రభుత్వంలో కీలక పదవుల ఎంపిక విషయంలో కానీ, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యల విషయంలో కానీ.. రేవంత్ రెడ్డి అడుగు ముందు వేయకుండా అడ్డుకుంటున్న శక్తులు ఎవరనే దానిపై విస్తృతంగా చర్చ జరగుతున్నది.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy Govt | పథకాల అమలులో జాప్యమే కాంగ్రెస్ సర్కార్‌కు డేంజర్ బెల్?
Telangana Politics | కాడి ఎత్తేసిన తెలంగాణ మంత్రులు? వ్యతిరేకతను రేవంత్‌పై నెట్టేసే యోచన!
Fine Quality Rice | రేవంత్ సర్కార్ తెచ్చిన సన్నబువ్వ పథకం సూపర్ సక్సెస్
Maleriraptor kuttyi | తెలంగాణలో జీవించిన.. డైనోసార్ మలేరిరాప్టర్ కుట్టి గురించి మీకు తెలుసా?
Vidyut Soudha | విద్యుత్తు శాఖలో డైరెక్టర్లు లేకుండా 3 వేల కోట్ల కొనుగోళ్లు!.. భారీగా కమీషన్లు?