Site icon vidhaatha

Gautam Gambhir | భారత జట్టు హెడ్‌కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌.. ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా..!

gautam gambhir as head coach

Gautam Gambhir | టీమిండియా హెడ్‌ కోచ్‌గా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ నియాకమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా ప్రకటించారు. రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌తో ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. మూడు ఫార్మాట్లకు కోచ్‌గా గంభీర్ వ్యవహరించనున్నాడు. ఇక ప్రత్యేక కోచ్‌లను నియమించబోమని జైషా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా మూడున్నరేళ్లు పని చేయనున్నారు. బీసీసీఐ ఈ ఏడాది మేలో హెడ్‌ కోచ్‌ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. గంభీర్‌తో పాటు మహిళా జట్టు మాజీ కోచ్‌ డబ్ల్యూ వీ రామన్‌ సైతం ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తాజాగా హెడ్‌కోచ్‌గా గంభీర్‌ పేరును జైషా ప్రకటించారు.

టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్‌ పేరును ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని.. హెడ్‌ కోచ్‌గా గౌతీని స్వాగతిస్తున్నానన్నారు. ఆధునిక క్రికెట్‌ వేగంగా అభివృద్ధి చెందిందని.. ఈ మార్పును గౌతమ్‌ దగ్గరగా చూశాడని తెలిపారు. తన కెరీర్‌లో కష్టాలను ఓర్చుకొని విభిన్న పాత్రల్లో రాణిస్తూ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని తనకు నమ్మకం ఉందన్నారు. జట్టుపై అతనికి ఉన్న స్పష్టమైన దృష్టి, అనుభవం కోచింగ్ పాత్రను పూర్తిగా స్వీకరించగలిగేలా చేసిందని, గంభీర్ ఈ సరికొత్త ప్రయాణానికి బీసీసీఐ పూర్తిగా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

ఇక మాజీ క్రికెటర్‌ ఐపీఎల్‌ కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లకు మెంటార్‌గా పని చేశాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. 2022, 2023 సీజన్స్‌లో లక్నోను ప్లేఆఫ్స్‌ వరకు తీసుకెళ్లగలిగాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో కేకేఆర్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తూ ఛాంపియన్‌గా తీర్చిదిద్దాడు. గంభీర్‌ కోచ్‌గా పదవీకాలం ఈ నెలలో మొదలై డిసెంబర్‌ 31, 2027 వరకు కొనసాగుతుంది. అతని కోచింగ్‌లో టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2025, 2027 ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌, టీ20 వరల్డ్‌కప్‌ – 2026, వన్డే ప్రపంచకప్‌ 2027 తలపడనున్నది.

ఈ ఐసీసీ మెగా ఈవెంట్స్‌ గంభీర్‌ పెద్ద పరీక్ష కానున్నాయి. జూలైలో శ్రీలంకతో జరిగే వైట్ బాల్ సిరీస్‌తో గంభీర్ పదవీకాలం మొదలవుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లు ఆడనుంది. వచ్చే ఏడాదిలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ కూడా ఆస్ట్రేలియాలో పర్యటించనున్దని. ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2025లో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆ ఏడాది మధ్యలో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. 2026లో భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్‌ దక్షిణాఫ్రికాలో ఆడనున్నది.

 

Exit mobile version