Site icon vidhaatha

Team India | టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ రేసులో ముగ్గురు..! జహీర్‌, బాలాజీల్లో ఎవరికి ఛాన్స్‌..?

Team India | రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా తప్పుకోవడంతో టీమిండియాలో మార్పుల పర్వం మొదలైంది. బీసీసీఐ సెక్రటరీ జైషా టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ను నియమించారు. హెడ్‌ కోచ్‌తో పాటు బ్యాటింగ్‌ కోచ్‌, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే, ఫిల్డింగ్‌ కోచ్ టీ దిలీప్‌ తమ పదవులు రాజీనామా చేసినట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు గంభీర్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ను ఎంపిక చేసుకునేందుకు షరతు పెట్టినట్లుగా సమాచారం. అయితే, తనకు కావాల్సిన కొందరి పేర్లను గంభీర్‌ బీసీసీఐకి ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. అయితే గంభీర్ స్వతహాగా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కావడంతో ప్రత్యేకంగా బ్యాటింగ్‌ కోచ్‌ను నియమించే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తున్నది.

పరిశీలనలో జహీర్‌ఖాన్‌, బాలాజీ పేర్లు..

ఇక బౌలింగ్‌ కోచ్‌కు సంబంధించి ముగ్గురి బౌలర్ల పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. ఇందులో ఒకరు 2011లో గంభీర్‌తో కలిసి ప్రపంచకప్‌ ఆడిన జట్టులో సభ్యుడు కావడం విశేషం. జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. బౌలింగ్‌ కోచ్‌గా మాజీ ఫాస్ట్‌ బౌలర్లు జహీర్‌ ఖాన్‌, లక్ష్మీపతి బాలాజీతో పాటు వినయ్‌కుమార్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే, ఇందులో జహీర్‌ ఖాన్‌, లక్ష్మీపతి బాలాజీ పేర్లను బీసీసీఐ పరిశీలిస్తుందని.. వినయ్‌ కుమార్‌పై ఆసక్తి చూపించడం లేదని నివేదిక పేర్కొంది. వాస్తవానికి బౌలింగ్ కోచ్‌గా వినయ్ కుమార్ పేరును గంభీర్ సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ మరికొందరి పేర్లను కోరిందని.. జహీర్, బాలాజీ పేర్లు బీసీసీఐకి నచ్చినట్లుగా తెలుస్తున్నది.

అసిస్టెంట్‌ కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌..?

దీంతో పాటు అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్ పేరును కూడా గంభీర్ సిఫార్సు చేశాడు. జహీర్ 92 టెస్ట్ మ్యాచ్‌లలో 311 వికెట్లు కూల్చగా.. అన్ని ఫార్మాట్లలో 309 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మొత్తం 610 వికెట్లు పడగొట్టాడు లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌. 2011లో గంభీర్‌తో పాటు ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టులో జహీర్ సైతం ఉన్నాడు. అదే సమయంలో, బాలాజీ ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో అతను 37.18 సగటుతో 27 వికెట్లు తీయగలిగాడు. మరోవైపు 30 వన్డేల్లో 39.52 సగటుతో 34 వికెట్లు తీశాడు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులైన తర్వాత, భారత జట్టులోని సహాయక సిబ్బందిని నియమించనున్నారు.

Exit mobile version