విధాత : అస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా తొమ్మిది వికెట్లతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో అస్ట్రేలియా తొలి రెండు వన్డేలలో విజయం సాధించి సిరీస్ ను ఎగరేసుకపోగా.. నామమాత్రమైన ఆఖరి వన్డేలో భారత్ విజయం సాధించి సీరిస్ ఆధిక్యతను 2-1కి తగ్గించగలిగింది. చివరి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాటర్లు రోకో ద్వయం( రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ)లు అజేయ సెంచరీ, హాఫ్ సెంచరీలతో రాణించడం అభిమానులకు ఊరట ఇచ్చింది.
టాస్ గెలిచిన అస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని భారత బౌలర్ల ధాటికి 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. అసీస్ విధించిన లక్ష్యాన్ని టీమిండియా 38.3ఓవర్లలోనే 1వికెట్ నష్టానికి చేధించి విజయం సాధించింది. రోహిత్ శర్మ 125 నాటౌట్(125బంతుల్లో 13ఫోర్లు, ఒక సిక్స్), విరాట్ కోహ్లీ 74నాటౌట్(81బంతుల్లో 7ఫోర్లు) పరుగులతో మళ్లీ తమ పూర్వ ఫామ్ అందుకున్నారు. వీరు రెండో వికెట్‌కు 169 బంతుల్లో 168 పరుగులు జత చేశారు. వన్డే వరల్డ్ కప్ కు ముందు వారిద్దరు తిరిగి ఫామ్ అందిపుచ్చుకోవడంతో టీమిండియాకు సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. మొదటి రెండు వన్డేల్లో వరుసగా డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మళ్లీ తన లయ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వన్డేల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇంతకు ముందు మూడోస్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కుమార సంగక్కరను (14234 పరుగులు) అధిగమించాడు. కోహ్లీ కంటే ముందు 18426 పరుగులతో సచిన్ తెందూల్కర్ ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ కెప్టెన్ గిల్ 24పరుగులకు(47బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్స్) హెజల్ వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ మొదటి వికెట్‌కు 69 పరుగులు జత చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన అసీస్ భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 46.4 ఓవర్లలో 236 పరుగులకు అలౌట్ అయ్యింది. అసీస్ బ్యాటర్లలో మ్యాట్ రెన్‌షా (56) హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30), ట్రావిస్ హెడ్ (29), కూపర్ కనోలీ (23), నాథన్ ఎల్లిస్ (16) పరుగులు చేశారు. టీమ్‌ఇండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2.. సిరాజ్, కుల్‌దీప్, అక్షర్, ప్రసిద్ధ్‌కృష్ణ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆరుగురు భారత బౌలర్లు బౌలింగ్ చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క వికెట్ తీయడం గమనార్హం. 1986 తర్వాత ఇలా ఆసీస్‌పై ప్రతి భారత బౌలర్ వికెట్ తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
