IND-W vs NZ-W: India face New Zealand in virtual Quarter-Final for World Cup semi-final hopes
- ఇరు జట్లకూ చావో – రేవో
- స్వదేశంలో ఓడితే భారత్‌కు మరింత అప్రతిష్ట
- టెన్షన్‌తో రెండు జట్లలోనూ వణుకు
(విధాత స్పోర్ట్స్ డెస్క్)
నవీ ముంబయి:
WWC 2025 : IND-W vs NZ-W | మూడు వరుస పరాజయాలతో అవమానకర పరిస్థితుల్లో ఉన్న భారత జట్టు తమ వరల్డ్ కప్ ప్రస్థానాన్ని తిరిగి గాడిన పడేయాలన్న కసితో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరగనున్న ఈ మ్యాచ్ భారత జట్టు సెమీఫైనల్ ఆశలను నిలుపుకోవడంలో కీలకం కానుంది. ఓడిపోతే దాదాపుగా రెండు జట్లు ఇంటిముఖం పట్టే పరిస్థితుల్లో రేపు జరుగబోయే మ్యాచ్ ఒకరకంగా క్వార్టర్–ఫైనల్.
భారత్ – విజయం తప్ప మరో మార్గం లేదు
శ్రీలంక, పాకిస్థాన్‌లపై అవలీలగా గెలిచిన భారత్, ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమి పాలైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ఉన్న ఈ జట్టుకు రేపటి మ్యాచ్ ‘డూ ఆర్ డై’. కివీస్‌పై విజయం సాధిస్తేనే సెమీఫైనల్‌కు దారులు తెరుచుకుంటాయి.
కానీ, ఆ పని అంత తేలిక కాదు. సుజీ బేట్స్, సోఫీ డివైన్ వంటి సీనియర్ ఆటగాళ్లతో న్యూజిలాండ్ బలంగా ఉంది. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయినా, వారు ఇంకా రేసులో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవకపోతే వారి సెమీఫైనల్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకే ఇది ఇరుజట్లకూ నాకౌట్ పోటీగా మారింది. అయితే ఇరు జట్లకూ ఇంకో మ్యాచ్ మిగిలేఉంటుంది కాబట్టి, సాంకేతికంగా రేపటి పోటీ సెమీస్ ప్రవేశానికి ఆటంకం కాదు. ఇక్కడ ఆ మ్యాచ్‌ల ఫలితాలు ఊహించగలవే కనుక, భారత్‌కే సానుకూలంగా ఉండే ఛాన్సుంది. కానీ, రేపు గెలిస్తే మాత్రం నిబ్బరంగా సెమీస్‌కు వెళ్లిపోవచ్చు.
వాతావరణం, పిచ్ పరిస్థితులు
గత రెండు రోజులుగా నవీ ముంబయిలో అకాల వర్షాలు కురిసినా, గురువారం మ్యాచ్ రోజున పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా. సాయంత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశముండటంతో డీఎల్ఎస్ లెక్కలు ప్రాముఖ్యత సంతరించుకునే అవకాశం ఉంది. డీవై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, రేపు పరుగుల పండుగే.
భారత జట్టు సమస్యలు, న్యూజీలాండ్ సవాళ్లు
భారత్ ఐదు మ్యాచ్‌ల్లో వివిధ కాంబినేషన్లను పరీక్షించింది కానీ, స్థిరమైన టీమ్11ను ఖరారు చేసుకోలేక ఇబ్బది పడుతోంది. చివరి మ్యాచ్‌లో అదనపు బౌలర్‌ను తీసుకోవడం తాత్కాలిక ఫలితాన్ని ఇచ్చినా, బ్యాటింగ్ వైఫల్యంతో గెలుపు ముందు బోర్లాపడింది. ముఖ్యంగా యువ పేసర్ క్రాంతి గౌడ్ ప్రారంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చి ఒత్తిడికి గురవుతోంది.
మరోవైపు, న్యూజిలాండ్ ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్ ఈ వరల్డ్ కప్‌లో అసలు ఫామ్‌లో లేరు. ఇద్దరి భాగస్వామ్య సగటు కేవలం 10.66 మాత్రమే ఉండటం వారికి ఆందోళన కలిగిస్తోంది.
తుది జట్ల అంచనా:
భారత్ (IND-W): స్మృతి మందాన, ప్రతీకా రావల్, హర్లీన్ దేవల్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్/జెమిమా రోడ్రిగ్స్
న్యూజిలాండ్ (NZ-W): సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమీలియా కెర్, సోఫీ డివైన్, బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇజాబెల్లా గేజ్, జెస్ కెర్, రోస్మరీ మైర్, ఈడెన్ కార్సన్, లియా తాహుహు
స్టాట్స్ & ఆసక్తికర విషయాలు
- ODI వరల్డ్ కప్‌ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు విజయశాతం చాలా తక్కువ.
- సుజీ బేట్స్ ఇంకో 67 పరుగులు చేస్తే రెండో అత్యధిక ODI రన్‌స్కోరర్‌గా నిలుస్తుంది.
- లియా తాహుహు తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతోంది.
- DY పాటిల్ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు ఆడిన 8 T20 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది.
మొత్తానికి, భారత్, న్యూజీలాండ్, వర్షం – ఈ మూడూ ఆడబోయే రేపటి మ్యాచ్ అభిమానుల నరాలు తెంపడం ఖాయం. రేపు అడిలైడ్‌లో భారత ‘పురుషుల’ మ్యాచ్ కూడా ఉంది గానీ, భారతీయుల ఆత్మ మాత్రం ముంబైలోనే తిరుగుతుంది.