- న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో భారత్ జయవిజయం
- స్మృతి, ప్రతీక విధ్వంసక శతకాలు, అర్థశతకంతో జెమీమా తాండవం
- టోర్నమెంట్లో భారత్ అత్యధిక స్కోరు – 340/3
- సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా – 6 పాయింట్లు, +0.63 నెట్ రన్‌రేట్
(విధాత స్పోర్ట్స్ డెస్క్)
మూడు వరుస పరాజయాల తర్వాత, చావో–రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు జూలు విదిల్చారు. శివంగుల్లా గర్జించి 5వ సారి ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. నవీ ముంబైలో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో భారత్ వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరిన నాలుగో జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య రేపు జరిగే మ్యాచ్ విజేతతో 30వ తేదీన ఇదే డివై పాటిల్ స్టేడియంలో సెమీఫైనల్ ఆడనుంది.
స్మృతి, ప్రతీకల వీర విధ్వంసం
టాస్ ఓడిపోయి, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 340 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు స్మృతి మందాన (109), ప్రతీకా రావల్ (122) ఇద్దరూ అద్భుత శతకాలు సాధించి భారత భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ జంట తొలి వికెట్‌కు 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించింది. ఇది మహిళల వన్డేల్లో వారి రెండో 200+ భాగస్వామ్యం కావడం విశేషం. ఏ వికెట్‌కైనా ప్రపంచకప్‌లో భారత్‌కిదే అత్యధిక భాగస్వామ్యం. అలాగే న్యూజీలాండ్‌పై కూడా ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
మంధాన 95 బంతుల్లో తన 14వ వన్డే శతకం సాధించి, మహిళల వన్డే క్రికెట్‌లో సుజీ బేట్స్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్(15) ఉంది. అలాగే, అంతర్జాతీయ శతకాల్లో ఇది 17వది. మెగ్ లానింగ్‌తో కలిసి సంయుక్తంగా అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. రావల్ 134 బంతుల్లో 122 పరుగులు సాధించి తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చింది. ఇది ఆమె రెండో వన్డే శతకం, అలాగే ప్రపంచకప్‌లో మొదటిది.
రోడ్రిగ్స్ దూకుడు.. బౌలర్ల చెడుగుడు
మందాన, రావల్ అవుట్ అయిన తర్వాత ఆ విధ్వంసాన్ని జెమిమా రోడ్రిగ్స్ అందిపుచ్చుకుని మైదానాన్ని అల్లకల్లోలం చేసింది. గత మ్యాచ్‌లో బెంచ్‌పై ఉన్న జెమీమా, ఈసారి 3వ స్థానంలోకి వచ్చి 55 బంతుల్లో 76* పరుగులు చేసింది. ఆమె దూకుడుతో చివరి 9 ఓవర్లలో భారత్ 86 పరుగులు రాబట్టి భారీ స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది.
వర్షం కారణంగా మ్యాచ్ కొంతసేపు నిలిచిపోగా, డిఎల్ఎస్ ప్రకారం, న్యూజిలాండ్‌కు 44 ఓవర్లలో 325 పరుగుల లక్ష్యం నిర్ణయించారు. భారీ లక్ష్యం కావడంతో ముందే ఆశలు వదిలేసుకున్న కివీస్ పెద్ద ప్రతిఘటనేమీ ఇవ్వకుండా భారత బౌలర్లకు లొంగిపోయారు. రేణుకా సింగ్ ఆరంభంలోనే ప్లిమ్మర్, డివైన్ వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను కుదిపేసింది. స్నేహ్ రాణా కీలక సమయానికి అమీలియా కేర్ (45)ను అవుట్ చేసి భారత ఆధిపత్యాన్ని కొనసాగించింది. బ్రూక్ హాలిడే (81) ఒంటరిగా పోరాడినా, శ్రీ చరణి చేతిలో అవుట్ కావడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
న్యూజిలాండ్ నిర్ణీత 44 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 6 పాయింట్లు సాధించిన భారత్ సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇక మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఈనెల 26న ఇదే నవీ ముంబైలో ఆడనుంది కానీ, ఆ మ్యాచ్ ఫలితం భారత్ 4వ స్థానాన్ని మార్చలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విజయం అనంతరం మాట్లాడుతూ – “ఈ విజయం జట్టు కృషికి నిదర్శనం. ప్రతీ ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఇప్పుడు మా లక్ష్యం ఫైనల్ గెలవడం” అని అన్నారు.
భారత స్కోరు: 49 ఓవర్లలో 340/3 (రావల్ 122, మందాన 109, రోడ్రిగ్స్ 76 నాటౌట్)
న్యూజిలాండ్: 44 ఓవర్లలో 272 ఆలౌట్ (హాలిడే 81)
భారత్ విజయం: 53 పరుగులు
భారత్ న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి మహిళల వరల్డ్‌కప్ సెమీఫైనల్ బరిలోకి దిగింది.
