Ind vs SA T20I | తొలి టి20లో సౌతాఫ్రికాపై భారీ విజయం సాధించిన భారత్​

హార్దిక్ పాండ్యా 59*, అర్ష్‌దీప్ ఆదిలోనే రెండు కీలక వికెట్లు, అక్షర్, వరుణ్​ కట్టుదిట్టమైన బౌలింగ్​తో మొత్తం బౌలింగ్ యూనిట్ కలిసి సౌతీస్​ను 74 పరుగులకే మట్టి కరిపించింది. భారత్ 101 రన్స్ భారీ తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్​ల సిరీస్​లో 1–0తో ముందడుగేసి, ప్రపంచకప్​ ముంగిట్లో ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక పంపింది.

Team India players celebrating South Africa’s collapse in the first T20 match, with Arshdeep Singh and Jasprit Bumrah among the group

India crush South Africa by 101 runs in opening T20I

(విధాత స్పోర్ట్స్ డెస్క్‌)

Ind vs SA T20I | దక్షిణాఫ్రికాతో కటక్​లో జరిగిన మొదటి T20లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా కేవలం 74 పరుగులకే కుప్పకూలి టి20లో తమ అత్యల్ప స్కోరుతో దారుణ పరాజయం పాలైంది.

టాస్​ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్​కు వచ్చిన భారత్​ పిచ్​పై తేమతో ఆదినుండే ఇబ్బందులు ఎదుర్కొంది. బంతి అనిశ్చితంగా బౌన్స్ అవుతున్న పరిస్థితుల్లో మొదటి ఓవర్ నుంచే టాప్ ఆర్డర్ ఒడిదొడుకులకు లోనైంది. శుబ్‌మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ లుంగి ఎన్‌గిడి బౌలింగ్‌కు బలయ్యారు. మిడిలార్డర్​ కూడా నిలబడలేకపోయింది. డాషింగ్​ ఓపెనర్​ అభిషేక్ శర్మకు స్ట్రైక్ దక్కలేదు, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ బౌన్స్‌కి దొరికిపోయారు. వీరు ముగ్గురు కలిసి 53 బంతుల్లో 49 పరుగులు మాత్రమే చేశారు.

ఊహించని మలుపు తిప్పిన హార్థిక్​

78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్​ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా మ్యాచ్​ను మలుపు తిప్పాడు. మొదటగా క్రీజులో నిలిచి పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకున్న హార్దిక్, తర్వాత స్పీన్ మరియు పేస్ బౌలింగ్​లను దీటుగా ఎదుర్కొని బలమైన షాట్లతో రన్‌రేట్‌ను అమాంతం పైకి లేపాడు. ముఖ్యంగా కేశవ్ మహారాజ్‌ ఓవర్లో రెండు భారీ సిక్సులు, నోకియా వేగాన్ని వాడుకుని బౌండరీలు, చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు—ఇవన్నీ మొత్తం ఇన్నింగ్స్‌ రూపురేఖలను పూర్తిగా మార్చాయి. 120 పరుగులే కష్టం అనుకున్న స్థాయి నుండి ఏకంగా 175 పరుగులు చేసిందంటే అదంతా పాండ్యా చలవే. చివరి వరకు నిలబడ్డ హార్దిక్ 59*(28 బంతులు, 4 సిక్స్​లు, 6 ఫోర్లు)తో నాటౌట్​గా మిగిలాడు. ఈ ఇన్నింగ్స్‌లో పాండ్యా తన 100వ T20I సిక్స్ కూడా నమోదు చేశాడు.

బౌలర్ల అద్భుత సమన్వయం; సౌతాఫ్రికా దారుణ పతనం

176 పరుగుల లక్ష్యం ఏమంత పెద్దది కాదనుకున్నదక్షిణాఫ్రికా, పిచ్​ కూడా తమకు అనుకూలంగా మారుతుందని ఆశపడ్డారు.  కానీ, వారి ఆశలు అడియాసే అయ్యాయి. భారత పేసర్లు మొదటి మూడు ఓవర్లలోనే మ్యాచ్​ను తమవైపు తిప్పుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ అవుట్‌స్వింగర్‌తో మొదటి ఓవర్లోనే డేంజరస్​ డీ కాక్‌ను సున్నాకే డగౌట్​కు పంపి, తన రెండో ఓవర్‌లో స్టబ్బ్స్‌ను దెబ్బతీశాడు. మార్క్​రమ్​(14), బ్రెవిస్​(22) కాసేపు పోరాడినా, అవేవీ పనికిరాలేదు. వచ్చినవారు వచ్చినట్లే వెనక్కివెళ్లిపోవడంతో 12.3 ఓవర్లలోనే 74 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. అంతర్జాతీయ టి20ల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు.

జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తన 100వ T20I వికెట్ తీసుకోవడం కొసమెరుపు. ప్రపంచవ్యాప్తంగా మూడు ఫార్మాట్లలో 100+ వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్లలో ఆయన ఒకరు. ఆఖరి వికెట్ శివం దూబే దక్కించుకుని భారత ఘనవిజయాన్ని ఖరారు చేసాడు.

Latest News