India vs Australia : రెండో వన్డేలోనూ భారత్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను ఆసీస్ 2-0తో గెలుచుకుంది. భారత్‌లో రోహిత్ (73), శ్రేయస్ (61) రాణించారు. ఆసీస్‌లో షార్ట్ (74), కనోలి (61) విజయంలో కీలకపాత్ర పోషించారు.

India vs Australia

విధాత : ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. టీమ్ఇండియా పై ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-0తో మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే శనివారం (అక్టోబర్ 25) సిడ్నీలో జరగనుంది. రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (74; 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్‌ కనోలి (61*; 53 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌ సెంచరీలు సాధించారు. మిచెల్ ఒవెన్ (36; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాట్ రెన్‌షా (30), ట్రావిస్ హెడ్ (28), మిచెల్ మార్ష్‌ (11) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ తలో రెండు వికెట్లు, సిరాజ్, అక్షర్ పటేలో చెరో వికెట్ సాధించారు.

భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ గిల్, కోహ్లీ ఒకే ఓవర్లో ఔటవ్వడంతో భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ రెండు వికెట్లను బార్ట్ లెట్ సాధించాడు. ఈ దశలో రోహిత్, శ్రేయస్ మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం (136 బంతుల్లో) నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. రోహిత్ శర్మ (73; 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (61; 77 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకాలు చేయగా.. అక్షర్ పటేల్ (44; 41 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9), కేఎల్ రాహుల్ (11) విఫలం కాగా.. విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్ అయి అభిమానులను నిరాశ పరిచాడు. వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్‌ రెడ్డి (8) కూడా త్వరగా ఔటైపోయారు. చివర్లో టెయిలెండర్లు హర్షిత్ రాణా (24*), అర్ష్‌దీప్ సింగ్ (13) రాణించడంతో భారత్ 250కిపైగా స్కోరు చేసింది. అసీస్ స్పిన్నర్ అడమ్ జంపా 4వికెట్లు, బార్ట్ లెట్ 3వికెట్లు, స్టార్క్ 2వికెట్లు సాధించారు.