విధాత:దిగ్గజ పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్ గా పేరుగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ (91) కన్నుమూశారు. కరోనా అనంతరం అనారోగ్య సమస్యలతో చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (పిజీఐఎంఈఆర్) లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు.గత నెల 20న మిల్కా సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మే 24న మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. చికిత్స అనంతరం నెగటివ్ రిపోర్టు రావడంతో మే 30వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
తరువాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఈ నెల 3వ తేదీన చండీగఢ్ లోని పిజీఐఎంఈఆర్ లో చేర్పించారు. ఆ రోజు నుండి అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ కరోనా వైరస్ తో పోరాడుతూ ఈ నెల 14వ తేదీన మృతి చెందారు. భార్య మృతి చెందిన అయిదు రోజులకే ఆయన కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
1932 నవంబర్ 20న జన్మించిన మిల్కాసింగ్ 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగుల పందెంలో మిల్కాసింగ్ ఆరవ స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్ గా మారారు. మిల్కాసింగ్ 9 ఏళ్ల పాటు హైదరాబాద్ (సికింద్రాబాద్) లో శిక్షణ పొందారు. అనంతరం 1958 కామన్ వెల్త్ గెమ్స్ లో స్వర్ణ పతకం కైవశం చేసుకుని తన సత్తా చాటారు. అనంతరం టోక్యో, జకార్తా, ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. 1960లో రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లో 400 మీటర్ల విభాగంలో నాల్గవ స్థానంలో నిలిచారు. 1959 లో భారత ప్రభుత్వం మిల్కాసింగ్ కు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మిల్కా సింగ్ జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని “భాగ్ మిల్క్ భాగ్” అనే బాలీవుడ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మిల్కాసింగ్ మృతితో క్రీడాలోకం మూగబోయింది.
ReadMore:కోకకోలా కంపెనీకి 30 వేల కోట్లు నష్టం .. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు