India-Asia Cup 2025 | ఈయేటి ఆసియా కప్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తేలికపాటి లక్ష్యమైన 58 పరుగులను ఒక వికెట్ కోల్పోయి సాధించింది. 4.3 ఓవర్లలో 60 పరుగులు చేసి 2 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా పాయింట్ల పట్టికలో చేరింది. భారత నెట్‌రన్‌రేట్ 10.4 ఉండటం విశేషం. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(16 బంతుల్లో 30, 3 సిక్స్‌లు, 4 ఫోర్లు), శుభమన్ గిల్(9 బంతుల్లో 20 పరుగులు, 1 సిక్స్, 4 ఫోర్లు) మ్యాచ్‌ను దాదాపు ముగింపుకు తీసుకువచ్చాక, అభిషేక్ అవుటవడంతో, కెప్టెన్ సూర్య, గిల్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేసారు. ఇన్నింగ్స్ తొలిబంతినే సిక్స్ కొట్టిన అభిషేక్ తన ఉద్దేశమేంటో స్పష్టంగా తెలిపాడు. ఊహించినట్లే తన వీర విహారానికి యుఏఈ బౌలర్లు ఊచకోతకు గురయ్యారు. 16 బంతుల్లో 31 పరుగులు చేసి అభిషేక్ పెవిలియన్ చేరగా, గిల్ 20 పరుగులతో, సూర్య 7 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు.
అంతకుముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, శివమ్ దూబే 3 వికెట్లు తీసి యుఏఈ టాపోర్డర్‌ను చీల్చేశారు. కుల్దీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి అరబ్బులను కోలుకోలేని దెబ్బ తీసాడు. వీరిద్దరి విజృంభణ వల్ల యుఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. యుఏఈ బ్యాటర్లలో ఓపెనర్లు చేసిన 22, 19 పరుగులే రెండంకెల స్కోర్లు. మిగిలినవారందరూ కలసి చేసిన పరుగులు 16 మాత్రమే.
ఆసియా కప్ టీ20 చరిత్రలో యుఏఈకి ఇది కనిష్ట స్కోరు. మొత్తంగా టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో ఇది రెండో కనిష్ట స్కోరు. మొదటిది హాంకాంగ్ 38 పరుగులు. కాగా మొత్తంగా పురుషుల టి20 పోటీల్లో భారత్పై ప్రత్యర్థి దేశం నమోదు చేసిన అత్యల్ప స్కోరుగా కూడా నమోదైంది.
భారత్ బౌలింగ్‌కు దిగిన వెంటనే పేస్-స్పిన్ కాంబినేషన్‌తో పట్టు సాధించింది. పవర్‌ప్లే తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మధ్య ఓవర్లలోనే ఇన్నింగ్స్ భారత్ నియంత్రణలోకి వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు.