IND vs NZ 1st T20I | అభిషేక్ శర్మ సునామీతో భారత్ ఘన విజయం: తొలి టి20లో కివీస్‌పై ఘనవిజయం

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టి20లో భారత్ 238 పరుగుల భారీ స్కోరు చేసి, న్యూజీలాండ్‌ను 48 పరుగుల తేడాతో ఓడించింది. అబిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులతో విజృంభించగా, రింకూ సింగ్ డెత్ ఓవర్లలో 44 పరుగులతో చెలరేగాడు. కివీస్ 190/7 మాత్రమే చేసి పరాజయం పాలైంది. భారత్ 5 మ్యాచ్​ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలోకి అడుగిడింది.

Abhishek Sharma smashing a big shot while scoring 84 runs off 35 balls in the 1st T20I.

India Thrash New Zealand by 48 Runs in 1st T20I: Abhishek Sharma’s 84 and Rinku Singh’s Late Blast Seal Huge Win

సారాంశం

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టి20లో భారత్ 238/7 భారీ స్కోరు చేసి, న్యూజీలాండ్‌పై 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ 84 పరుగులు, రింకూ సింగ్ 44 నాటౌట్‌తో చెలరేగారు. కివీస్ కేవలం 190 పరుగులకే పరిమితమైంది.

 

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

IND vs NZ 1st T20I | వన్డే సిరీస్​ను న్యూజీలాండ్​కు అప్పగించిన భారత్​ నేడు టి20‌‌ సిరీస్​ను ఆరంభించింది. 5 మ్యాచ్​ల ఈ సిరీస్​లో మొదటి మ్యాచ్​ నాగ్​పూర్​లో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య భారత్​ ఘనంగా ఆరంభించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 238 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, ప్రతిగా కివీస్​ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. దీంతో 48 పరుగుల తేడాతో భారత్​ ఘనవిజయం సాధించి, 1–0 తో​ సిరీస్​లో ముందంజలో నిలిచింది.

ఆదిలోనే దెబ్బతిన్న కివీస్​

భారీ లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన న్యూజీలాండ్​కు ఆదిలోనే భారీ ఎదురెదెబ్బ తగిలింది. స్కోరుబోర్డు మీద ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయి షాక్​లో ఉన్న కివీస్​ను టిమ్​ రాబిన్​సన్​, గ్లెన్​ ఫిలిప్స్​ ఆదుకున్నారు. వీరిద్దరూ 3వ వికెట్​కు సరిగ్గా 50 పరుగులు జోడించారు. రాబిన్​సన్(21)​ ఔట్​ కాగానే వచ్చిన మార్క్​ చాప్​మన్(39)​తో కలిసి​ ఫిలిప్స్​ ఇన్నింగ్స్​ను కుదుటపరిచే ప్రయత్నం చేసాడు. ఇక్కడా వీరిద్దరూ 79 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫిలిప్స్​ దూబేకు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరగానే, కివీస్​ బ్యాటర్లు వెంటవెంటనే ఇంటిముఖం పట్టారు. కెప్టెన్​ సాంట్​నర్​ 20 పరుగులు, వన్డే సిరీస్​ హీరో డారెల్​ మిచెల్​ 28 పరుగులు చేసారు.

భారత బౌలర్లలో వరుణ్​ చక్రవర్తి, శివం దూబే చెరో 2 వికెట్లు తీసుకోగా, అర్షదీప్​, హార్థిక్​, అక్షర్​ తలా ఒక వికెట్​ తీసుకున్నారు.

భారత్​ పరుగుల​ సునామీ

కాగా, టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు దిగిన భారత్​ విధ్వంసాన్ని చూసిన కివీస్​ కెప్టెన్​ బ్యాటింగ్ ఎందుకిచ్చాన్రా..భగవంతుడా.. అనుకునేట్టు ఓపెనర్​ అభిషేక్​ శర్మ పూనకం వచ్చినట్లు శివాలెత్తాడు. మరో ఓపెనర్​ సంజూ సాంసన్​, హిట్టర్​ ఇషాన్​ కిషన్​ త్వరగానే ఔటయినా, కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​తో కలిసి, అభిషేక్​ స్కోరుబోర్డును రన్నింగ్​రేస్​లోకి దింపాడు. పూర్తిగా బ్యాటింగ్​ హవా కొనసాగిన ఈ ఇన్నింగ్స్​లో భారత్​ ఘనమైన ఆధిపత్యాన్ని చాటింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 238/7 భారీ స్కోరు ప్రత్యర్థి ముందుంచింది.

సుడిగాలిలా చెలరేగిన అభిషేక్ శర్మ

ఇన్నింగ్స్ ఆరంభంలో సంజూ సామ్‌సన్ (10), ఇషాన్ కిషన్ (8) త్వరగా ఔటవడంతో కొంతమేర ఒత్తిడి అనిపించినా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పూర్తి చార్జ్​ తీసుకున్నాడు. బౌలరెవరైనా ఊచకోత కోస్తూ, బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లో 84 పరుగులు చేసిన అభిషేక్​ ఇన్నింగ్స్​లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయంటే, దాడి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. పవర్‌ప్లేలోనే పలు భారీ షాట్లు సంధించి, భారత రన్‌రేట్‌ను వేగంగా పెంచాడు. పవర్​ప్లేలో 68 పరుగులున్న స్కోరు 9 ఓవర్లకే 100 దాటింది. కెప్టెన్​ సూర్యతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన అభిషేక్​, సోధీ వేసిన లెగ్‌బ్రేక్‌తో లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఇచ్చినా, అప్పటికే భారత్‌కు 12 ఓవర్లలో 149 పరుగుల బలమైన పునాది ఏర్పడింది.

సూర్యకుమార్, హార్దిక్ మిడిలార్డర్​లో నిలకడగా..

అబిషేక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. అతడు 22 బంతుల్లో 32 పరుగులు చేసి ఇన్నింగ్స్ వేగాన్ని కొనసాగించాడు. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25) కూడా తనవంతు ఇన్నింగ్స్ ఆడాడు. పుల్ షాట్లు, డ్రైవ్‌లు ఆడుతూ స్ట్రైక్ రేట్ పెంచడంలో సహకరించాడు. శివం దూబే 4 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రింకూసింగ్​ చివరి ఓవర్లలో వీరవిహారం చేసి, స్కోరును 230 దాటించాడు.

రింకూ సింగ్ – డెత్ ఓవర్లలో కిల్లర్​ బ్యాటింగ్​

డెత్ ఓవర్లలో రింకూ సింగ్ తన సామర్థ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులతో చెలరేగిన రింకూ నాటౌట్​గా మిగిలాడు. ఆఖరి ఓవర్లో రింకూ 21 పరుగులు పిండుకోవడం గమనార్హం. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్​ న్యూజీలాండ్​ ముందు కఠిన లక్ష్యం నిలబెట్టింది.

న్యూజిలాండ్ బౌలర్లలో:
• జాకబ్ డఫీ – 4 ఓవర్లు, 27 పరుగులు, 2 వికెట్లు • జెమీసన్ – 4 ఓవర్లు, 54 పరుగులు, 2 వికెట్లు • సోధీ – 3 ఓవర్లు, 38 పరుగులు, 1 వికెట్ • సాంట్నర్ – 3 ఓవర్లు, 37 పరుగులు, 1 వికెట్ • క్లార్క్ – 4 ఓవర్లు, 40 పరుగులు, 1 వికెట్ తీసుకున్నారు.

దీంతో 5 మ్యాచ్​ల టి20 సిరీస్​లో భారత్​ తొలిమ్యాచ్​ గెలిచి 1 – 0తో ముందడుగేసింది. రెండో టి20 రాయ్​పూర్​లో 23వ తేదీన జరుగనుంది.

Latest News